వరంగల్‌లో ఎదురీదుతున్న బీఆర్ఎస్ – బీజేపీకి అడ్వాంటేజ్ ?

బీఆర్ఎస్‌కు వరంగల్ జిల్లా పెట్టని కోటలాంటిది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో సమయం సందర్భం లేకుండా హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహించిన కేసీఆర్.. వరంగల్ లో భారీ బహిరంగసభ పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ రైతులు ఎవరూ తమ భూమిలో సభను పెట్టడానికి అంగీకరించలేదు. దీంతో ఎలాంటి సభను పెట్టలేకపోయారు. ఆ వ్యతిరేకత రైతుల్లోనే కాదని ప్రజల్లో కూడా ఉందని ఎన్నికల సమయంలో బయటపడుతోంది.

స్వయంకృతం వల్ల బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితి

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి, ఆ తదుపరి ఉద్యమ సమయంలో, ఎన్నికల్లో, ఎదురైన కష్టసుఖాల్లన్నింటా వరంగల్ గడ్డ మేమున్నామంటూ బాసటగా నిలిచి కొండంత బలాన్నిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అందించింది. బలంతో వెలుగువెలిగిన ఓరుగల్లు బీఆర్ఎస్ ప్రభ క్రమంగా సన్నగిల్లుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన మాత్రం పార్టీలోని సెకండ్ లీడర్ షిప్ బహిరంగంగా భగ్గుమంటోంది. ఎమ్మెల్యేల పై తిరుగుబావుటా ఎగురవేసి తమ అసంతృప్తిని బాహటంగా చాటిచెబుతున్నారు. ఇక కేడర్లో నాయకుల పట్ల తీవ్ర అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపట్ల స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందీ.

ఈ సారి ఎన్ని సీట్లొస్తాయో తెలియని పరిస్థఇతి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిలో ఒకటి, అర మినహా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన ఉద్యమకారులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఎమ్మెల్సీ రవిందర్ రావు అనుచరులు నిరసన జెండాలెత్తారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పైన పార్టీ నాయకులు, శ్రేణులు మండిపడుతున్నారు. గ్రామాలు, తండాలకు వెళితే నిరసనలతో అడ్డుకుని వాపస్ పంపించారు. పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లికి అసమ్మతి వర్గ నాయకులు రహస్య సమావేశం నిర్వహించి గట్టి ఝలక్ ఇచ్చారు. ఘన్‌పూర్‌లో డాక్టర్ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.

ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

జనగామ, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, మానుకోట, డోర్నకల్, వరంగల్ తూర్పు సెగ్మెంట్లలో వరుసగా రెండు అంతకంటే ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఉంటూ వస్తున్నారు. ఒక్క నర్సంపేట మాత్రమే రెండవ పర్యాయం పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు పార్టీలు మారినప్పటికీ అభ్యర్థులు వారే కావడం ఒక అంశం అయితే, మరి కొన్నిచోట్ల అభ్యర్థులు మారినా బీఆర్ఎస్ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ పడటం పార్టీకి ప్రతికూలంగా మారింది. దీంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గులాబీ నేతల మేకపోతు గాంభీర్యం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెరిగిన తీవ్ర వ్యతిరేకత బహిరంగంగా వినిపిస్తోంది.

లాభపడనున్న బీజేపీ

వరంగల్ లో ఉద్యమం సమయం నుంచి కాంగ్రెస్ బలహీనపడింది. రెండు, మూడు నియోజకవర్గాల్లోనే గట్టి పోటీ ఇస్తోంది. మిగతా చోట్ల బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. వీరికి లాభించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.