అయోధ్య ప్రాణప్రతిష్టకు ‘ఆదిపురుష్‌’ – స్పెషల్ ఇన్విటేషన్

ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభా్‌సతో పాటు కన్నడ నటుడు యశ్‌కు వచ్చే నెల 22న అయోధ్యలో నిర్వహించే రామమందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌కపూర్‌-ఆలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, సన్నీ డియోల్‌, టైగర్‌ ష్రాప్‌, ఆయుష్మాన్‌ ఖురానా కూడా అతిథుల జాబితాలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, రజినీకాంత్‌, మోహన్‌లాల్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, ధనుశ్‌, రిషభ్‌ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.

జనవరిలో దేశమంతా రామనామం

దేశంలో జనవరి మొత్తం అయోధ్య రామాలయం సందడి ఉండనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి వీఐపీ ఆహ్వానాలు వచ్చాయన్నదానిపై స్పష్టత లేదు. కానీ మొదటి సారిగా హీరో ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. టాలీవుడ్‌లో ఇంకెవరికీ ఇలాంటి చాన్స్ రాలేదు. ప్రభాస్ బాహు బలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన ఏ సినిమా చేసినా హిందీలో సైతం మంచి మార్కెట్ వచ్చింది. అదే సమయంలో ప్రభాస్‌కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేతగా ఉంటూ చనిపోయారు. గతంలో ప్రభాస్ రెండు, మూడు సార్లు ప్రధానితో భేటీ అయ్యారు కూడా. ఇటీవల ఆదిపురుష్‌లో రాముడి క్యారెక్టర్ కూడా పోషించారు. అందుకే ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.

జాతీయ పండుగలా ప్రాణ ప్రతిష్ట

అయోధ్య రామాలయాన్ని జాతీయ పండుగలాగా నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్‌ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.

అద్భుతంగా నిర్మాణం

అయోధ్య రామాలయం 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అపురూపమైన మందిరంతో నిర్మితమయింది. భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరాన్ని సిద్ధం చేశారు. భారతీయ అధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం ఉంటుంది. మొత్తం 5 గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ఆలయ సముదాయంలో ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వాడలేదు. కేవలం రాజస్థాన్, ఆగ్రా నుంచి తెప్పించిన రాతి పలకలతోనే ఆలయ నిర్మాణం జరిగింది. రెండున్నర వేల ఏల్లు అయినా ఆలయ పటిష్టత దెబ్బతినకుండా, రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా నిర్మాణం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఇక ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా, రాముడి విగ్రహం కనిపించేలా ఉండటం ప్రత్యేకత. గర్భగుడి దగ్గర దాదాపు 40 కిలోల వెండితో కూడిన పైకప్పును ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇది చరిత్రకెక్కుతోంది. ప్రస్తుతం అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది.