‘ఆదిపురుష్’ సినిమా థియేటర్లో చూడాలా-వద్దా!

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్లలోకి వచ్చేసింది. వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాఘవునిగా ప్రభాస్ , జానకిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్ నిర్మాతలు.

ఆదిపురుష్ కథ ఇదే
అరణ్యవాసంలో ఉన్న రాఘవని చూసి శూర్పణక మనసు పడుతుంది. తాను వివాహితుడను అని చెప్పి రాఘవుడు వెళ్లిపోతాడు. సీతను చంపాలనుకున్న శూర్పణఖకు బుద్ధి చెబుతాడు లక్ష్మణుడు. ఏడుస్తూ అన్నయ్య రావణుడి వద్దకెళ్లిన శూర్పణఖ సీతాదేవి అందంగురించి పొగుడుతుంది. సీతను సొంతం చేసుకోవాలనుకున్న రావణుడు మారువేషంలో వెళ్లి లంకకు సీతను ఎత్తుకొచ్చేస్తాడు. ఆ తర్వాత జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు వానరులతో కలసి రాఘువుడు చేసిన యుద్ధం ఎలా ఉంది? ఆ తర్వాత ఏమైందన్నదే కథ.

రామాయణానికి మోడ్రన్ టచ్
రామాయణం కథలో కొత్తదనం ఆశించకూడదన్న విషయం అందరికీ తెలుసు. అయితే నటీనటల ఎంపిక, తెలిసిన కథను మరింత ఆసక్తికరంగా చెప్పడమే ప్రత్యేకత. ఆదిపురుష్ విషయానికొస్తే ప్రజలకు తెలిసిన రామాయణానికి మోడ్రన్ టచ్ ఇచ్చారు ఓం రౌత్. రామాయణాన్ని కమర్షియల్ గా మార్చలేరు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ తీసుకున్నారు. ముఖ్యంగా లంకేశుడిగా సైఫ్ గెటప్ విషయంలో విమర్శలు ఇంకా కొనసాగే అవకాశాలున్నాయి. విజువల్స్ పరంగా చూస్తే ఇప్పుడున్న టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించినప్పుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండును అనిపిస్తుంది థియేటర్లో ప్రేక్షకులకు. పైగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ని యుద్ధవీరుడిగా చూసిన తర్వాత తప్పకుండా వార్ సీన్స్ లో కంపేరజన్ ఉంటుంది. మూడు గంటలు సాగే ఈ సినిమాలో విజువల్స్ బావున్నాయి. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. తెలిసిన సన్నివేశాలే అయినా మళ్లీ కొత్తగా అనిపిస్తుంది.

థియేటర్లో చూడాలా-వద్దా
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి ఏదో వివాదం చుట్టుముడుతూనే ఉంది. మరి సినిమా విడుదలైంది కదా ఏమీ కంప్లైంట్స్ లేవా అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కానీ వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు నచ్చేలా తీశాం అని ఓం రౌత్ చెప్పినట్టే ఈ సినిమాలో వానరసైన్యం, లంకలో రావణ సైన్యం చూస్తే కొన్ని హాలీవుడ్ మూవీస్ లో పాత్రలు చూసినట్టుంటాయి. రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు, సీతాదేవిగా కృతికి ఉన్న సన్నివేశాలు తక్కువే అయినా న్యాయం చేసింది. రావణుడిగా సైఫ్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు. మండోదరిగా నటించిన సోనాల్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఓవరాల్ గాచెప్పుకుంటే భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితామంటే థియేటర్లో చూడొచ్చు లేదంటే..ఓటీటీకి వచ్చేవరకూ ఆగడం బెటర్.