రీసెంట్ గా మాజీ సీఎం , టీడీపీ అధినేత నెల్లూరులో టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ దిగి జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ‘‘చూడు….జగన్!.. ఇవే టీడీపీ హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడా?.. జవాబు చెప్పగలవా? ’’ అంటూ జగన్‌కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు.
దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. చంద్రబాబు నెల్లూరులో సెల్ఫీ దిగిన టిడ్కో ఇళ్లను వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకనే పూర్తి చేశామని తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి సురేష్ ప్రకటించారు. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు.
చంద్రబాబు, నారా లోకేష్ టిడ్కో ఇళ్ల సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని సురేష్ మండిపడ్డారు. చివరికి, తాజ్‌మహల్, చార్మినార్ ముందు కూడా చంద్రబాబు, లోకేష్‌లు సెల్ఫీలు తీసుకుని తామే కట్టామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.