హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. కొందరు పండుగలు, పబ్బాలకు పూజలు చేస్తే..మరికొందరు నిత్యం ఇంట్లో పూజ చేస్తారు. భారీగా పూజ చేయకపోయినా కనీసం దీపం పెట్టి పూలు వేసి నైవేద్యం సమర్పించి నమస్కరించుకుంటారు. నిత్య దీపారాథన చేసేవారు పూలు కొనుక్కుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు.. మరికొందరు మాత్రం ఇంటి బయట, పక్కింట్లోనూ, ఎదురింట్లోనూ ఉండే పూలచెట్ల నుంచి పూలు సేకరిస్తారు. ఇలా చేయవచ్చా..శాస్త్రం ఏం చెబుతోంది..పండితులు ఏమంటున్నారు..
రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు…కనీసం వాళ్లని అడగరు కూడా. కొందరైతే పొద్దున్నే పాలకి, వాకింగ్ కి వెళ్లి వస్తూ వస్తూ దార్లో కనిపించిన పూలన్నీ సేకరించుకుని వచ్చేస్తారు…స్వయంగా ఆ ఇంటివాళ్లు వచ్చి క్వశ్చన్ చేసినా పూలు కోస్తే ఏమైందన్నట్టు కోపంగా చూస్తారు. పైగా వీళ్లకి దేవుడంటే భక్తిలేదన్నట్టు చూస్తారు. వాస్తవానికి ఇంటి యజమానికి కూడా తమ పూలు చెట్టునుంచి మొత్తం పూలు కోసే అధికారం లేదు. పూలు కోసేముందు చెట్టుకుని నమస్కరించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి కానీ మొత్తం ఖాళీ చేయకూడదు. ఆ పూల మొక్క యజమానికే పూలు మొత్తం కోసే అధికారం లేనప్పుడు వేరేవారికి ఎలా ఉంటుందంటారు పండితులు. ఇంకా చెప్పాలంటే ఎవరి ఇంట్లో పూలు కోసి తీసుకొచ్చారో .. మీరు చేసే పూజలో సగం పుణ్యం వాళ్లకి చెందుతుంది. దీనికి సంబందించి గరుడపురాణంలో ఓ శ్లోకం కూడా ఉంది.
తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||
అంటే….తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు..వాటిలో పూజలు చేసేవారు అడవిలో కోతిలా పుడతారు, చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు.
పూజలు చేస్తే పుణ్యం రావాలి. మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ పక్కింట్లో పూలు దొంగతనంగా కోసి పూజచేస్తే దానివల్ల సత్ఫలితాలు రాకపోగా పాపం మూటగట్టుకున్నవారు అవుతారు. అందుకే పూలు కొని తీసుకోచ్చి పూజచేయండి, మీ చెట్టునుంచి కోసుకోండి.. అంతగా పక్కింట్లో పూలు కోస్తే వాళ్లని అడగండి..అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.