అబ్కీ బార్.. ఎన్డీయే సర్కార్.. 400 పార్…

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా గ్రూపు విచ్ఛిన్నమవుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరింత పటిష్టమవుతోంది. మోదీ నాయకత్వంలో కమలనాథులు నిర్దేశిత లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ సైతం పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తూ బీజేపీ లక్ష్యాలను, భారతీయ సమాజం కోసం చేయాల్సిన పనులను వారికి వివరిస్తున్నారు. కాంగ్రెస్ పనైపోయిందని, ఇక బీజేపీకి తిరుగులేదన్న వాస్తవాన్ని పార్టీ శ్రేణుల వద్దకు మోదీ స్వయంగా తీసుకెళ్తున్నారు…

ఆర్టికల్ 370 రద్దు పురోగామి పరిణామం…

మోదీ తన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అబ్కీ బార్ .. ఎన్డీయే సర్కారు.. 400 పార్.. అన్న నినాదాన్ని మోదీ ప్రస్తావిస్తుంటే..జనం సంభ్రమాశ్చర్యాలతో, ఆనందడోలికల్లో మునిగిపోతున్నారు. శుక్రవారం హరియాణాలోని రేవరిలో జరిగిన రూ.10,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ.. తన నినాదాన్ని జనంతో కూడా చెప్పించారు. ఆర్డికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్ లోని వేర్పాటువాద శక్తులను దారికి తెచ్చామని చెప్పిన మోదీ.. ఎన్నికలకు కూడా 370 వర్తిస్తుందన్నారు. తమ నిర్ణయాలపై సంతృప్తి చెందిన దేశ ప్రజలు బీజేపీకి మాత్రమే 370 స్థానాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్డీయే భాగస్వామలందరికీ కలిపి 400 లోక్ సభా సీట్లు దాటతాయని మోదీ చెప్పుకున్నారు. దేశ ప్రజల మనోభావాలను తాను ప్రతిబింబిస్తున్నానని మోదీ చెప్పుకున్నారు..

కాంగ్రెస్ పార్టీది ఆశ్రిత పక్షపాతం

ప్రధాని మోదీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పిదాలని దేశ ప్రజల ముందుంచుతున్నారు. ఆ పార్టీలో ఆశ్రితపక్షపాతం, కుటుంబ పాలన తప్పితే విశాల జనహితంపై ఆలోచించే అవకాశమే లేదని మోదీ అంటున్నారు. తాజా పరిణామాలు కూడా మోదీ ఆలోచనా విధానాన్ని సమర్థించే తీరుగా ఉంటున్నాయి. కాంగ్రెస్ కుటుంబ పాలనతో విసుగుచెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ కూడా ఫిరాయించారంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉక్కపోత ఉందో అర్థం చేసుకోవచ్చు. సోనియా, రాహుల్ చెప్పినట్లు వినే వారు మాత్రమే కాంగ్రెస్ లో ఉంటారు. అలా సర్దుకుపోలేని వాళ్లు బయటకు నడవాల్సిందేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి..

మోదీని తిట్టడమొక్కటే వారికి తెలుసు….

కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని కూడా ప్రధాని మోదీ ఎండగట్టారు. ఐనదానికి కాని దానికి తనను తిట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశ సంక్షేమం కోసం పనిచేసే వారంటే కాంగ్రెస్ పార్టీకి గిట్టదని మోదీ గుర్తుచేశారు…వికసిత్ భారత్ అనే మాటను ఉచ్ఛరించేందుకు కూడా కాంగ్రెస్ ఇష్టపడటం లేదని ఎందుకంటే తాను ఆ దిశగా పనిచేస్తున్నానన్న కోపం ఆ పార్టీలో ఉందని మోదీ చెప్పారు. మేకిన్ ఇండియా కూడా కాంగ్రెస్ కు నచ్చని విధానమని మోదీ గుర్తు చేశారు. ఎప్పుడు విదేశాల నుంచి ఎగుమతి చేసుకుని కమిషన్లు తినే పార్టీకి మేకిన్ ఇండియా ఎలా నచ్చుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…