ఆలూ లేదు చూలూ లేదు సీఎం కుర్చీ పంచాయతీ – కాంగ్రెస్ ఇక మారదు !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత రాజకీయాలకు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకుంటారు. అంటే ఎవరికి వారు గ్రూపులను మెయిన్ టెయిన్ చేయడమే కాదు చాన్స్ వస్తే తాము పీసీసీ చీఫ్ అని లేదా ముఖ్యమంత్రి అని ప్రకటనలు చేసేసుకుంటూ ఉంటారు. వీరి తీరు చూసి ఇతర పార్టీలు.. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు నెలలకో సీఎం వస్తారని అలాంటి పార్టీ మనకు అవసరమా అని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

తామే సీఎం అనుకుంటున్న నేతలు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, సోనియాగాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని, పార్టీలో తనకంటే సీనియర్లు ఎవరూ లేరని భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరికి వారు తానే సీఎం అని ప్రకటించుకుటూ ఉంటారు. రేవంత్‌రెడ్డి కాబోయే సీఎం అని ఆయన చెప్పుకోరు కానీ ఆయన అనుచరులు ప్రకటిస్తూనే ఉంటారు. ఇక జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి తనను వెదుక్కుంటూ వస్తుందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ లాంటి నేతలు ఇప్పటికే తాము సీఎం రేసులో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉన్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆరెస్‌ నాయకులు తరచూ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో డజన్‌మందికిపైగానే సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేస్తుంటారు.

ముందు గెలిస్తేనే కదా ఏ పదవి అయినా ?

కొంత మంది సీనియర్ నేతలు ముందు కాంగ్రెస్ గెలిస్తేనే కదా ఏ పదవి అయినా వచ్చేది.. ముందు గెలుపు మీద దృష్టి పెట్టాలని సీఎం పదవిపై కామెంట్ చేస్తున్న వారికి హితవు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారు. ఎవర్ని చెప్పినా వారు సీఎం పదవిపై ప్రకటలు మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు సీఎం రేసులో ఉన్నామని చెప్పుకోకపోతే.. తర్వాత ఇబ్బంది పడతామనుకుంటున్నారు. కోమటిరెడ్డి లాంటి నేతలు.. . తమ వర్గానికే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు చేతుల్లో ఉంటే.. తర్వాత కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోయినా తమ దారి తాము చూసుకోవచ్చనుకుంటున్నారు.

కాంగ్రెస్ ఎవరో ఓడించాల్సిన పని లేదు !

తెలంగాణలో కాంగ్రెస్ ను ఎవరో ఓడించాల్సిన పని లేదు. ఆ పార్టీ నేతలే ఓడించుకుంటారు. సీఎం సీటు కోసం జరుగుతున్న పంచాయతీని చూసి తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ముందు గెలవండి.. ఆ తర్వాత పదవుల కోసం పోరాడుకోండి అని.. సలహాలిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ నేతలు గాల్లో తేలిపోతున్నారు. అలాంటి ప రిస్థితి లేదని ఎవరు చెప్పినా వినిపించుకోవడం లేదు. డిసెంబర్ మూడో తేదీన వారి బుడగ పేలిపోతుందని .. సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు.