హిందూ ఆలయాలు ఆథ్యాత్మిక కేంద్రాలు. భక్తులు వెళ్లి దేవీదేవతల దర్శనం, పూజలు చేసుకునే ప్రదేశాలు. అక్కడ ఎలాంటి అవరోధాలకు అవకాశాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆలయ నిర్వహకులకు ఉంటుంది. అన్యమతస్తులు, నాస్తికులు, రౌడీ గుంపులు, అల్లరి మూకలకు ఆలయాలు వినోద కేంద్రాలుగా మారకూడదు. ఆలయానికి వెళ్లే ప్రతీ ఒక్కరూ దేవునిపై నమ్మకం, మతంపై విశ్వాసంతోనే లోనికి ప్రవేశించాలి. అప్పుడే ఆలయ పవిత్రతను, దేవుడి పట్ల భక్తిభావాన్ని కాపాడే వీలుంటుంది..
మద్రాసు హైకోర్టు కీలక తీర్పు
హిందూ దేవాలయాల నిర్వహణ తీరు, ఆలయ ప్రవేశానికి సంబంధించి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ఒక కీలక తీర్పు చెప్పింది. అన్ని ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం లేదని చెబుతూ బోర్డులు పెట్టాలని తమిళనాడు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు జస్టిస్ ఎస్. శ్రీమతి ఆదేశాలిచ్చారు. హిందువులు కాని వారికి ఆలయ ధ్వజస్థంభం దాటి అనుమతి ఉండదని కూడా బోర్డుపై రాయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చారు. మత విశ్వాసాలను పాటిస్తూ మత ప్రచారం చేసే హక్కు ప్రతీ హిందువుకు ఉంటుందని జస్టిస్ శ్రీమతి తన తీర్పులో రాశారు.
పళని మురుగన్ ఆలయ ప్రవేశంపై చర్చ
తమిళనాడులోని దిండుగల్ జిల్లా పళణిలో ప్రఖ్యాత దండాయుధపాణి (మురుగన్) ఆలయం ఉంది. అందులోకి ప్రతీ ఒక్కరు ప్రవేశిస్తున్నారని, దీని వల్ల హిందువుల మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయని డి. సెంథిల్ కుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ వేశారు. హిందువులు కాని వారు ప్రధాన ఆలయం, ఉపాలయాల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలివ్వాలని ఆయన అభ్యర్థించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… హిందువులు కాని వారికి ఆలయం లోపలికి ప్రవేశించే అనుమతి లేదని ప్రతీ చోట బోర్డులు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం, దేవాదాయ, పర్యాటక శాఖకు ఆదేశాలిచ్చారు. ప్రతీ ఒక్కరూ సరదాగా వచ్చి వెళ్లేందుకు ఆలయాలు పిక్నిక్ ప్రదేశాలు కాదని జడ్జి తెగేసి చెప్పారు.
హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలి…
హిందూమతంపై నమ్మకం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలోకి ప్రవేశించినవ్వకూడదని కోర్టు తేల్చేసింది. ప్రత్యేక సందర్భాల్లో హిందూయేతరులు దర్శనం చేసుకోవాలనుకుంటే..అప్పుడు వాళ్లు ఆలయ కమిటీకి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మూలవిరాట్ మహిమపై తమకు నమ్మకమూ, భక్తి భావమూ ఉన్నాయని అందులో రాయాలి. హిందూ మతాచారాలను పాటిస్తామని చెప్పుకోవాలి. ఆలయ నియమనిబంధనలను గౌరవిస్తామని ప్రకటించాలి. అప్పుడే హిందూయేతరులకు ఆలయ ప్రవేశం కల్పించాలని కోర్టు నిగ్గు తేల్చింది. పైగా ప్రతీ హిందూయేతరుని నుంచి తీసుకున్న డిక్లరేషన్ కు సంబంధించిన వివరాలను ఒక రిజిష్టర్ లో నమోదు చేయడం తప్పని సరి అని కోర్టు నియమం పెట్టింది.ఇదీ పళణి ఆలయానికి మాత్రమే కాకుండా తమిళనాడులోని అన్ని ఆలయాలకు వర్తిస్తుందని ప్రకటించింది. అప్పుడే మత సామరస్యం వెల్లివిరుస్తుందని కూడా తేల్చింది. మరి నాస్తికుడు ఎంకే స్టాలిన్ సీఎం పీఠంపై కూర్చున్న తమిళనాడులో ప్రభుత్వం ఈ నియమాలను పాటిస్తుందో లేదో చూడాలి..