స్థిరమైన, శాశ్వతమైన, అంకితభావంతో ఉన్న ప్రభుత్వం

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ ఘనవిజయం సాధించడానికి కారణాలు విశ్లేషించే పని వేగవంతమైంది. ఎవరికి తోచినది వాళ్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినడం వల్లే బీజేపీ గెలిచిందని కొందరంటే, విపక్షాల ఐక్యత ఎండమావిగా మారి ఓడిపోయారని మరికొందరు అన్నారు. దీనిపై మోదీ స్వయంగా తన మనసులో మాటను వివరించారు. బీజేపీ గెలుపు అంత సునాయాసంగా ఎలా సాధ్యమైందో ఆయనే చెప్పుకొచ్చారు…

అది దేశ ప్రజల మూడ్..

ప్రధాని మోదీ ఒక ప్రతిష్టాత్మక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల మూడ్ కు సంకేతమని ఆయన వివరించారు.స్థిరమైన, శాశ్వతమైన, అంకితభావంతో పనిచేసే ప్రభుత్వాన్ని నిర్వహిస్తామన్న విశ్వాసంతో ప్రజలు తమకు పట్టం కట్టారని ఆయన అన్నారు. బీజేపీకి రాష్ట్రాల్లో అంతగా బలం లేదని ప్రచారం చేసే వారికి ఈ ఫలితాలే గట్టి సమాధానమని మోదీ తేల్చేశారు. ప్రత్యర్థులు అనవసరంగా ఆయాస పడుతున్నారన్నట్లుగా ఆయన అన్నారు.తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగిందని, ఇతర పార్టీల బలం పాతళానికి పడిపోయిందని ఆయన విశ్లేషించారు.

సంక్షేమం, అభివృద్ధే గెలిపించాయన్న మోదీ..

తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని మోదీ స్వయంగా విశ్లేషించారు. పేదల కోసం నిర్మించిన నాలుగు కోట్ల ఇళ్లు కంటికి కనిపించే సాక్ష్యాలని ఆయన చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే కాగితం మీద రాసే మూడు అక్షరాల మాట కాదని.. అది విధానాలు, ఉద్దేశం, నాయకత్వం, ట్రాక్ రికార్డుకు సంబంధించిన అంశమని ప్రధాని అన్నారు. ఉచిత రేషన్, రైల్వేల ఆధునీకరణ లాంటి వాటికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి పార్టీగా మారిందని స్థానిక సంస్థల్లోనూ, పంచాయతీల్లోనూ పార్టీకి గట్టి పట్టు వచ్చిందన్నారు.

2024 విజయానికి పునాది

ప్రతి పథకమూ ప్రజలకు చేరాలని బీజేపీ కంకణం కట్టుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోదీ కూడా అదే మాట చెప్పారు. గతంలో చిన్న పనికి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చేదని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వచ్చేదని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వస్తోందని ఆయన అన్నారు. ఇండియా గ్రూపు పేరుతో చేసిన సరికొత్త ప్రయోగం విఫలమైందని మోదీ అన్నారు. వారిలో అసలు ఐకమత్యమే లేదని మోదీ గుర్తు చేశారు. ఇండియా గ్రూపు పేరుతో ఓట్ల చీలికకు కాంగ్రెస్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టిందన్నారు. జనం పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతివ్వడం ద్వారా 2024లో తాము ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నామో చెప్పేశారన్నారు.ఉత్తరాది, దక్షిణాది అంటూ వస్తున్న ప్రచారం సహేతుకం కాదని మోదీ కొట్టిపారేశారు. దేశమంతా ఐకమత్యంతో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. ప్రజలు తమకే మద్దతిస్తారన్న పూర్తి విశ్వాసం తనకుందని మోదీ చెప్పుకున్నారు.