ఆధ్యాత్మిక వాది -విమర్శలను పట్టించుకోని సినీ జ్ఞాని

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ పని చేసినా అందులో వైవిధ్యం కనిపిస్తుంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న అనుభూతి ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. ఎన్ని వివాదాలు తలెత్తినా, ఎంతమంది విమర్శించినా తన ఆధ్యాత్మికవాదాన్ని, సాంధుసంతులను గొరవించడాన్ని రజనీ ఎన్నటికీ వదిలిపెట్టరు. ఇప్పుడాయన చేసిన ఓ పనిలో కొందరు వివాదాలు సృష్టించాలనుకున్నా సూపర్ స్టార్ మాత్రం పట్టించుకోవడం లేదు. అదే ఆయన శైలి..

యూపీ సీఎం యోగీకి పాదాభివందనం

జైలర్ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సందర్భంగా రజనీకాంత్ ఆలిండియా ఆధ్యాత్మిక టూర్ పెట్టుకున్నారు . సాధు సంతులను కలుస్తున్నారు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన లక్నో వెళ్లారు. యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. యోగికి నమస్కారం చేసిన తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాన్ని సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తర్వాత ఆయన అఖిలేష్ యాదవ్ ను కూడా కలిశారు. సమాజ్ వాదీ పార్టీ నేతను ఆలింగనం చేసుకున్నారు.

కొందరు తమిళుల అభ్యంతరం

రజనీ తీరును కొందరు తమిళులతో పాటు నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఇదెన్నా తలైవా ఇప్పిడి పండ్రింగ…. అంటే ఇదేంటి నాయకుడా ఇలా చేస్తున్నారు.. అంటూ కొందరు నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇదీ తమిళనాడుకు సిగ్గుచేటు అని అంటున్నారు. ఆధ్యాత్మికత అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదని స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. రజనీ సాధారణ వ్యక్తి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దక్షిణాదికే సూపర్ స్టార్ అని చెబుతూ మరికొందరు విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లి తమిళుడినని పరిచయం చేసుకున్నప్పుడు ఇలాంటి పనులు ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళుల ఆత్మగౌరవం ఏం కావాలని కొందరు ఆందోళన చెందుతున్నారు..

ఆధ్యాత్మిక ప్రయాణంలో విమర్శలను పట్టించుకోని రజనీ

రజనీ మొదటి నుంచి దేవుడి భక్తి ఎక్కువగా ఉన్న సినీ హీరో. సినిమా పూర్తవ్వగానే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. సాంధుసంతులకు మొక్కి ఆశీర్వచనం తీసుకుంటారు. కొంతకాలం హిమాలయాల్లో గడిపేసి వస్తారు. ఈ సారి కూడా అదే జరిగింది. కాకపోతే యోగీకి పాదాభివందనం చేయడమే ఇప్పుడు కొందరికీ అభ్యంతరకరం. రజనీకి మాత్రం అందులో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే ఆదిత్యనాథ్ ఓ సన్యాసి.ఆయన సర్వసంగపరిత్యాగి. కేవలం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు సీఎం అయ్యారు. ఇందులో వయసుతో కూడా సంబంధం లేదు. గురువుగా స్వీకరించి మాత్రమే యోగీకి ఆయన దణ్ణం పెట్టారు. అందుకే కొందరు విమర్శలు చేసినా రజనీ పట్టించుకోరు. అభిమానుల మద్దతు కూడా రజనీకి ఉంది…