పార్లమెంటులోకి దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేయడంపై రాజకీయ దుమారం కొనసాగుతునే ఉంది. ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పార్లమెంటును స్థంభింపజేసేందుకు ప్రతిపక్షాలు రోజూ పనిచేస్తున్నాయి. ఇదీ ముమ్మాటికి ఉగ్రదాడి ప్రయత్నమని ఆరోపిస్తున్నారు..
హోం మంత్రి సమాధానం చెప్పాల్సిందే…
పార్లమెంటులో దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా స్వయంగా లొంగిపోవడంతో పాటు అనేక సంచలన విషయాలు ప్రకటించాడు. పార్లమెంటులో కొందరు, బయట కొందరు ఆత్మాహుతి చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. ఆ ప్లాన్ విఫలం కావడంతో ప్లాన్ బీని అమలు చేశామని స్మోక్ క్యానిస్టర్ ను ప్రయోగించామని చెప్పుకొచ్చాడు. ఆ స్మోక్ కానిస్టర్లు ప్రమాదకరం కాదని తొలుత భావించినప్పటికీ అవి ప్రాణహాని కలిగించేవేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అవి మేడిన్ చైనా వస్తువులని….వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాటిపై రాసి ఉందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభసాక్షిగా సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. రోజూ ఉభయ సభలను స్థంబింపచేస్తూనే ఉన్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని తరహాలో దాడి జరిగినట్లు ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తున్నాయి…
40 సార్లు భద్రతా వైఫల్యం
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై అమిత్ షా గట్టిగా సమాధానమిచ్చారు. ఇంతవరకు 40 సార్లు భద్రతకు తూట్లు పడ్డాయని ఆయన వివరించారు. కొందరు పాంప్లెట్లు విసిరారు. కొందరు గన్స్ పట్టుకొట్టారు. కొందరు నినాదాలిచ్చారు. ఇంకొందరు లోపలికి దూకారు. ఇవన్నీ విపక్షాలకు తెలియవా అని అమిత్ షా ప్రశ్నించారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా లోక్ సభ స్పీకర్ వాటిపై విచారణకు కమిటీలు వేశారని, కమిటీ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నారని కూడా అమిత్ షా గుర్తుచేశారు. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో పాస్ తీసుకుని సభలోకి ప్రవేశించిన సంగతిని గుర్తు చేస్తూ విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ప్రత్యారోపణ చేశారు.
పక్షం రోజుల్లో నివేదిక
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది. కమిటీ నివేదిక మరో 15 నుంచి 20 రోజుల్లో వస్తుంది. నివేదికను సమర్పించిన తర్వాత దాన్ని అధ్యయనం చేస్తామని అమిత్ షా చెబుతున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, పార్లమెంటులో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. ఈ లోపు విజిటర్స్ పాస్ విషయంలో కఠిన నియమాలను అమలు చేస్తున్నారు. కొందరికి మాత్రమే పాస్ లు ఇస్తూ… గంటలోగా బయటకు వచ్చేయ్యాలని ఆదేశిస్తున్నారు. ఎంపీల వెంట సైతం సెక్యూరిటీ మినహా ఇతరులు లోపలికి వెళ్లకుండా చూసుకుంటున్నారు…