వాస్తు..దినిని పట్టించుకోనివారు ప్రశాంతంగా ఉంటారు కానీ ఫాలో అయ్యేవారికి మాత్రం ప్రతీదీ సెంటిమెంట్ తోనే ముడిపడి ఉంటుంది. అడుగు వేసినా తీసినా, ఇంట్లో ఏం చిన్న మార్పు చేయాలన్నా వాస్తు ప్రకారం చేయొచ్చో లేదో అనే సందేహం వెంటాడుతుంటుంది. అయితే వాస్తు మొత్తం నిర్ణయించేది 8 మందితోనే. వారినే అష్టదిక్పాలకులు అంటారు. అంటే 8 దిక్కులకు కాపలా కాసేవారు అని అర్థం. దిక్కులు అనగానే…తూర్పు ,పడమర ,ఉత్తరం ,దక్షిణం అని ఠక్కున చెబుతారు. అయితే దిక్కులతో పాటూ నాలుగు మూలలు కూడా ఉన్నాయి. నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.
ఏ దిక్కుకి ఎవరు పాలకుడు
తూర్పు దిక్కు పాలకుడు ఇంద్రుడు-ఆయుధం వజ్రాయుధం-వాహనం ఐరావతం
పడమర దిక్కు పాలకుడు వరుణుడు- ఆయుధం పాశం- వాహనం మొసలి
ఉత్తర దిక్కు పాలకుడు కుబేరుడు- ఆయుధం ఖడ్గం- వాహనం నరుడు
దక్షిణం దిక్కు పాలకుడు యముడు-ఆయుధం దండం- వాహనం ఎద్దు
ఆగ్నేయం దిక్కు పాలకుడు అగ్ని-ఆయుధం శక్తి- వాహనం రాం
నైరుతి దిక్కు పాలకుడు నిరృతి- ఆయుధం కుంతం- వాహనం పిశాచం
వాయువ్యం దిక్కు పాలకుడు వాయువు-ఆయుధం ధ్వజం- వాహనం జింక
ఈశాన్యం దిక్కు పాలకుడు ఈశానుడు-ఆయుధం త్రిశూలం- వాహనం ఎద్దు
వీరితో పాటూ ఊర్ధ్వ దిక్కుకి బ్రహ్మనూ, అధో దిక్కుకు విష్ణువునూ పాలకులుగా భావిస్తారు. పురాతన ఆలయాలలోని పైకప్పుల మీద కూడా ఈ అష్టదిక్పాలకుల ప్రతిమలు ఉండటాన్ని గమనించవచ్చు. అష్టదిక్పాలకులు ఆధీనంలోనే ఇల్లు ఉంటుంది. నాలుగు మూలలు, నాలుగు దిక్కుల ఆధారంగానే ఇంటి వాస్తు నిర్ణయిస్తారు. ఏ వైపు తిరిగి తినాలి, ఎటువైపు తలపెట్టి నిద్రించాలి అనేవి కూడా ఈ అష్టదిక్పాలకుల ఆధారంగానే నిర్ణయిస్తారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో, వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. ప్రధాన ద్వారాన్ని నిర్మించుకున్నప్పుడు కూడా పైన సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకోవాలి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం