ఆ దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ – భారత్ కు టెన్షన్ తప్పదా!

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) ఎట్టకేలకు శాంతించిందని అంతా రిలాక్సయ్యారు. ఇల్లు కదలకుండా కూర్చుని కూర్చుని విసిగిపోయినవారంతా ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ ఇంతలోనే మరో మహమ్మారి హెచ్చరికలు జారీ చేస్తోంది.

యావత్ ప్రపంచం ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ మహమ్మారి పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అది మిగిల్చిన చేదు గురుతుల నుంచి బయటకు వస్తున్నారు. ఆ మధ్యన కొత్త వేరియంట్ కలకలం కాస్త రేగినా అదేమీ పెద్ద ప్రభావాన్ని చూపింది లేదు. కానీ తాజాగా వెలుగుచూసిన వైరస్ మాత్రం లైట్ తీసుకుంటే అంతే సంగతులు అన్నట్టు హెచ్చరిస్తోంది. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) అనే కొత్త వేరియంట్ బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇక్కడ నమోదవుతున్నవి 14.6 శాతం. యూకేలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే
బ్రిటన్‌లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో . ప్రజలు టీకా వేసుకున్నప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని హెచ్చరించింది. ఈజీ.5.1 వేరియంట్‌తో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనే సూచనలు ఏమీ లేవని తెలిపింది. అయితే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఈ వేరియంట్ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కొవిడ్ టెన్షన్ మొదలైనట్లేనన్న మాట వినిపిస్తోంది.

అవే జాగ్రత్తలు కొనసాగించండి
నిండా మునిగిన తర్వాత అప్రమత్తమయ్యే కన్నా ఇప్పటి నుంచే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణలు. వాతావరణంలో కూడా మార్పులొచ్చాయి. అంటే ఇన్ ఫెక్షన్లు త్వరగా వ్యాపించే సమయం ఇది. అందుకే ఏ చిన్న అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం