చరిత్రలో నిలిచిపోయే ఘట్టం – కిక్కిరిసిపోనున్న అయోధ్య

రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగర హోటళ్లలో ట్రావెల్ ఏజెంట్లు, భక్తులు ముందుగానే గదులను బుక్ చేసుకుంటున్నారు.

శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న విగ్రహప్రతిష్ఠాపన 2024 జనవరి 15 నుంచి జనవరి 24 మధ్య ఉండచ్చనే ప్రచారం సాగుతోంది. కచ్చితమైన తేదీని ఇంకా నిర్ణయించలేదు కానీ ఇంచుమించు ఆ పది రోజుల మధ్యే ఉండొచనే ప్రచారం సాగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని నగరంలోని హోటల్స్ యజమానులు, రిసార్ట్ యజమానులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ అయోధ్యలోని హోటల్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవిత్ర కార్యక్రమం సందర్భంగా అతిథులకు స్వాగతం పలికేందుకు తమ హోటళ్లను అలంకరించాలని సూచించారు. ఆ సమయంలో హోటల్ నిర్వాహకులు చెప్పిన విషయమే ఇది. ఢిల్లీ, ముంబై సరా మెట్రో నగరాల నుంచి వరుస కాల్స్ వస్తున్నాయని దాదాపు 10, 15 రోజుల పాటూ రూమ్స్ కావాలని ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారని చెప్పారు.

నవంబరుకి సిద్ధమవుతాయి
భక్తుల తాకిడి భారీగా ఉండనున్నందున పేయింగ్ గెస్ట్ పథకం కింద 41 మంది భవన యజమానులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పంపిణీ చేశారు. ఫైజాబాద్, అయోధ్యలలో 10 విలాసవంతమైన హోటళ్లు, 25 బడ్జెట్ హోటళ్లు, 115 ఎకానమీ హోటళ్లు, 35 గుర్తింపు లేని గెస్ట్ హౌస్‌లు, 50 ధర్మశాలలు, 50 హోమ్‌స్టే/పేయింగ్ గెస్ట్ హౌస్‌లు, జిల్లాలో మొత్తం 10,000 గదులతో దాదాపు 150 హోటళ్లు ఉన్నాయి. అదనంగా, నాలుగు ప్రభుత్వ అతిథి గృహాల్లో సుమారు 35 గదులు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 50 చిన్న గెస్ట్ హౌస్‌లు నవంబర్‌ నాటికి సిద్ధం కానున్నాయి.

విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవం
జనవరి 22న శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు అయోధ్యకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. మూడు అంతస్తుల రామాలయం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా శరవేగంగా పూర్తిచేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది.బాబ్రీ మ‌సీదు కూల్చివేసిన స్థ‌లంలో 70 ఎకరాల విస్తీర్ణమంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చూస్తోంది. రామ్‌ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది.