రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బాగా కోపమొచ్చింది. బీఆర్ఎస్ అవసరంగా మహారాష్ట్రలో జోక్యం చేసుకుంటోందన్న ఆగ్రహం అక్కడి నాయకుల్లో కనిపిస్తోంది. అందులోనూ కేసీఆర్ పార్టీ ప్రత్యేకంగా ఎన్సీపీని టార్కెట్ చేసిందన్న ఆందోళన శరద్ రావును వెంటాడుతోంది.. దానితో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పెద్ద స్కెచ్ వేశారు.
పలువురు ఎన్సీపీ నేతలను చేర్చుకున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ ను కేసీఆర్ జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత తొట్టతొలిగా మహారాష్ట్రపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర జిల్లాలో ఉన్న ఎన్సీపీ నేతలకు కేసీఆర్ గాలం వేశారు. నాందేడ్, షోలాపూర్, లాతూర్, అహ్మద్ నగర్, ఔరంగాబాద్ జిల్లాలోని ఎన్సీపీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారు…. వాళ్లు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే… కాస్త పెద్ద లీడర్లే బీఆర్ఎస్లోకి వచ్చారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్వామ్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కార్, లాతూర్లోని సీనియర్ నాయకుడు గుణ్వంత్ రావు లాంటి వారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. తమ పార్టీని బలహీనపరిచి బీఆర్ఎస్ ను డెవలప్ చేసుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు ఎన్సీపీ అనుమానిస్తోంది. అందుకే కేసీఆర్ కు గట్టి షాకివ్వాలని నిర్ణయించింది.
తెలంగాణలో వంద చోట్ల పోటీ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో వంద చోట్ల బరిలోకి దిగాలని పవార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న మంచిర్యాల్, అసీఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని నియోజవర్గాల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే షురు అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా బరిలోకి దిగుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై కూడా ఎన్సీపీ దృష్టి పెట్టింది. అయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలను మాత్రం టచ్ చేయకూడదని, అక్కడ ఎన్సీపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని పవార్ అనుచరులు అంటున్నారు..
కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి.. ?
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగు పెట్టినప్పటి నుంచి శరద్ రావు గుర్రుగానే ఉన్నారు. కేసీఆర్ తీరును విమర్శిస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తు వచ్చారు. . బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని చాలా రోజులుగా ఎన్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఎన్సీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఉద్దేశంతో ఎన్సీపీ తెలంగాణ బరిలోకి దిగినపక్షంలో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి హస్తం పార్టీకి ఇబ్బందులు ఎదురు కావచ్చు. మరి ఆ సంగతి ఎన్సీపీకి తెలుసో లేదు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును అరికట్టేందుకు ఎన్సీపీ ధమ్కీలు ఇస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.