సిర్పూర్.. ఈ పేరు వినగానే వెంటనే పేపర్ మిల్లు గుర్తుకువస్తుంది. సిర్పూర్ – కాగజ్ నగర్ పేపర్ మిల్లుకి పేరు గాంచింది. నియోజకవర్గాల పునర్ వ్యవస్ధీకరణలో భాగంగా ఇది కొమురం భీం జిల్లా కిందకు వచ్చింది. సిర్పూర్ తో పాటు ఆసిఫాబాద్ నియోజవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోనిదే. కౌతల, బెజ్జూర్, కాగజ్ నగర్, సిర్పూర్, దహేగావ్, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి మండలాలతో ఏర్పడిన ఈ నియోజవర్గంలో దాదాపు లక్షన్నర వరకు ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు టీడీపీ – కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోరు ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర విభజనతో బీఆర్ఎస్ బలం పుంజుకుంది. కానీ ఈ సారి ఏకంగా నాలుగు పార్టీల మధ్య పోరు సాగనుంది.
రెండు సార్లు గెలిచిన కోనప్ప ఈసారి కష్టమే
సిర్పూర్ ఓటర్లకు వరసగా రెండుసార్లు అభ్యర్థులను గెలిపించే ఆనావాయితీ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే కోనేరు కోనప్ప రెండుసార్లు గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారా లేదా అన్నది ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. ఇక నియోజకవర్గం విషయానికొస్తే అధికారపార్టీ తరపున కోనేరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న టాక్ ఉంది. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు కోనేరు కోనప్పపై ఉన్నాయి. పట్టణంలో డంప్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాన్ని అధికార పార్టీ అండదండలతో వెంచర్లుగా మార్చి అమ్మేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వాదన ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. కొన్ని నెలల క్రితం అటవీభూముల సాగు విషయంలో కోనేరు కోనప్ప సోదరుడు అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడులకు దిగడం రాజకీయ వివాదంగా మారింది. మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టు ఇంతవరకు పూర్తికాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దీని పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాదాపు 1 5ఏళ్లుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసుల కల కలగానే మిగిలిపోతోంది. ఫలితంగా తాగు, సాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లే ఎక్కువ – అందుకే బీఎస్పీ తరపున మాజీ ఐఏఎస్ ప్రవీణ్ పోటీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ ఓట్లే కీలకంగా మారడంతో రాజకీయపార్టీల చూపంతా ఆ వర్గంపై పడింది. తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తన సామాజిక వర్గం నుంచి కాకుండా జనరల్ కేటగిరిలో పోటీ చేయాలన్న ప్లాన్ లో భాగంగానే ఇక్కడ పోటీ చేస్తున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు ఉండటంతో కార్మిక కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మినీ ఇండియాగా పిలవబడే సిర్పూర్ లో దేశంలోని అన్నీ ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఒక్కో రాష్ట్రం వారిది ఒక్కో కాలనీ ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణేతరుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సిర్పూర్ – కాగజ్ నగర్ ఫ్యాక్టరీ కారణంగా ఇక్కడ స్థిరపడినవారు ఎక్కువే ఉన్నారు.
బలంగా మారిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ నేత పాల్వాయి హరిష్ బాబు.. దూకుడుగా ఉన్నారు. పల్లెపల్లెకు తిరుగుతున్నారు. సైలెంట్‌గా ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. బీజేపీ విధానాలను వివరిస్తున్నారు. అదేసమయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇక, ఎమ్మెల్యే కోనప్ప.. ప్రజలకు అందుబాటులో లేరని.. ఆయన కేవలం హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని విమర్శలు గుప్పిస్తు న్నారు. మొత్తంగా హరీష్ బాబు గత కొన్నాళ్లుగా ప్రజలతోనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ ఈ సీటును గెలవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీలతో పోలిస్తే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉంది.