నాదెండ్లకు చెక్ ? జనసేనలో ఇక నాగబాబేనా నెంబర్ 2 ?

జనసేన పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు .. జనసేనలో కీలక పదవి అప్పగించారు. ఇప్పటి వరకూ ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు మాత్రమే. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఇప్పటిదాకా ఇవ్వని ఈ పదవిని ఇప్పుడే ఎందుకు ఇచ్చారని జనసేన వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇలా ప్రత్యేకంగా పదవిని ఇవ్వడం మాత్రమే కాదు ఓ కార్యక్రమం ద్వారా బ్యాడ్జి స్వయంగా పెడుతూ ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో ఎక్కడా నాదెండ్ల మనోహర్ లేడు. నిజానికి ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా పక్కన నాదెండ్ల మనోహర్ ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం చర్చకు కారణం అయితే… నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం మరో కారణం..

పార్టీ వ్యవహారాలు ఇక ముందు నాగబాబు చూసుకుంటారా ?

ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో జనసేన పార్టీలో నాగబాబు పాత్ర మరింత పెరగనుంది. ఓ రకంగా ఇక నుంచి ఆయన నెంబర్ టు గా ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన కార్యదర్శి అంటే ఏ పార్టీలో అయినా కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు అన్ని విషయాలూ పట్టించుకోలేరు. రోజు వారీ వ్యవహారాలను అసలుచూసుకోలేరు. అందుకే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ ఆయనకు ఎలాంటి కీలక పదవి ఇవ్వలేదు.

నాదెండ్లకు ప్రాధాన్యం తగ్గించాలనే నాగబాబుకు కీలక పదవా ?

జనసేనానికి ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు వీటన్నింటినీ కంప్లీట్ చేసి రాజకీయ యాత్రలు ప్రారంభించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. మరో వైపు ఇప్పుడు పార్టీలో నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన ఒక్కరే కొంత కాలంగా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఓ రకంగా పార్టీ యంత్రాంగం మొత్తంపై ఆయనకు గ్రిప్ ఉంది. ఏ నేత అయినా నాదెండ్లను కన్సల్ట్ చేయాల్సి వస్తోంది. అదే సమయంలో అంతర్గతంగా ఆయన తీరుపై కొన్ని ఫిర్యాదులు ఆయనపై జనసేన హైకమాండ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్నారని.. అనుమానిస్తున్నారు. కారణం ఏదైనా పవన్ ఇప్పుడు నాగబాబుకు కీలక బాధ్యతలిచ్చారు.

ఇక జిల్లాల్లో విస్తృతంంగా పర్యటించనున్న నాగబాబు !

ఇకనుంచి నాదెండ్ల మనోహర్.. రోజువారీ పార్టీ వ్యవహారాలు చూసుకుని… నాగబాబు జిల్లాల్లో పర్యటించాలని అనుకుంటున్నట్లుగా చబెబుతున్నారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నా… విమర్శించేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీకి మేలు చేసేందుకు ప్రయత్నించే నేతల్లో నాగబాబు కంటే ఎవరూ ముందు ఉండరని.. ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వడం మంచి నిర్ణయమని జనసైనికులు అంటున్నారు. పొత్తుల విషయంలో ఇటీవల బీజేపీకి దూరం అయ్యేలా చేసిన ప్రకటనలపై కూడా నాదెండ్ల ప్రభావం ఉందని జనసైనికులు అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ… నాగబాబుకు పదవితో తేలిపోయే అవకాశం ఉంది. అయితే తనకు ప్రాధాన్యం తగ్గించినట్లు ఫీలయితే.. నాదెండ్ల మనోహర్ ఏం చేస్తారో ?