శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. అందుకే రామాలయం లేని గ్రామం ఉండదు, ఉండకూడదు అంటారు. ఆజానుబాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన రామచంద్రుడి కోసం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఆ విగ్రహ విశిష్టతిలివే..
జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని, దానికి అనుబంధంగా రామాలయాన్ని కర్నూలు జిల్లా మంత్రాలయంలో రూ.300 కోట్లతో నిర్మించనున్నారు. జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్చువల్ పద్ధతిలో ఇప్పటికే శంకుస్థాపన చేశారు. గుజరాత్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే నమూనా ఫైనల్ అయింది. ఆ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతోనే శంకుస్థాపన చేశారు.
విగ్రహ తయారీకీ రెండేళ్లు
108 అడుగుల పంచలోహ విగ్రహం తయారు చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. పూర్తిస్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు.
ప్రముఖ దేవాలయాలన్నీ ఇక్కడే
ఆలయ ఆకృతుల రూపకర్తల్లో ప్రముఖుడైన డాక్టర్ ఎ.వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ పదెకరాల్లోనే తిరుమల వెంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారు.
మంత్రాలయంలోనే ఎందుకు
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వేలమందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తుంటారు. కోట్లాది భక్తులు ఆరాధించే రాఘవేంద్రస్వామికి శ్రీరాముడు ఆరాధ్య దైవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శ్రీరాముని విగ్రహ ఏర్పాటుకు అవసరమైన పదెకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రాలయానికి మరో మణిహారంలా ఉండేలా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పంచలోహాలతో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని ‘జై శ్రీరామ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మంత్రాలయం నిలిచిపోనుంది.