మోదీ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సురేష్ గోపీ విజయం

కేరళలో బీజేపీ తొలి సారి ఖాతా తెరిచింది. ఆ పార్టీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపీ విజయం సాధించారు. దక్షిణ కేరళలోనే త్రిశూర్ లోక్ సభా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.కేరళకు ఇంతకాలం పెద్దగా పరిచయం లేని కమలం పార్టీని అక్కడ నిలబెట్టడంలో సురేష్ గోపీ కీలకపాత్ర వహించారు.

లోటును తీర్చిన గోపీ..

అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఎంపీలున్నారు. కేరళలో మాత్రం ఒక్క సారి కూడా ఆ పార్టీ గెలవలేదు. అసలు గెలుస్తుందా లేదా అన్న అనుమానమూ కలుగుతుండేది. అలాంటి చోట సురేష్ గోపీ పోటీ చేసి గెలిచారు. త్రిశూర్ లో సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్ ను ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మురళీధరన్ కు మూడో స్థానం దక్కింది. సురేష్ గోపీకి 4,12,338 ఓట్లు, సునీల్ కుమార్ కు 3,37,652 ఓట్లు, మురళీధరన్ కు 3,28,124 ఓట్లు దక్కాయి. ఈ క్రమంలో సురేష్ గోపీకి 74 వేల 686 ఓట్లు వచ్చినట్లయ్యింది.

గోపీని అక్కున చేర్చుకున్న త్రిశూర్..

త్రిశూర్ లో పోటీకి సురేష్ గోపీ మొదటి నుంచి ప్లాన్ చేసుకునే ముందుకు సాగారు. 2016లో రాజ్యసభకు నామినేట్ అయిన సురేష్ గోపీ… తర్వాత అధికారికంగా బీజేపీలో చేరారు. 2019లో త్రిశూర్ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు లక్షా ఇరవై వేల ఓట్లు వచ్చాయి. తర్వాత 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రెండు పర్యాయాలు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజాసేవలో ఉంటానని సురేష్ గోపీ ప్రకటించినప్పుడు ప్రధాని మోదీ ఆయన్ను పిలిపించి మాట్లాడారు. పార్టీ కోసం త్రిశూర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దానితో అప్పటి నుంచి సురేష్ గోపీ.. త్రిశూర్ పైనే ఏకాగ్రత చూపుతూ జనంలో మమేకమయ్యారు. అందరి సంక్షేమం కోసం పనిచేయడం కారణంగా ఈ సారి ఆయన విజయం సుగమమైంది..

స్థానికుడు కాకపోయినా…

నిజానికి సురేష్ గోపీ ఆ నియోజకవర్గానికి స్థానికుడు కాదు. ఐనా ఐదేళ్ల పాటు అక్కడి ప్రజల కోసం పనిచేశారు. పైగా ఆయన అల్లాటప్పా కాండేట్ కాదు. నటుడిగా ఆయనకు మంచి పేరుంది. మళయాళం, ఆంగ్లంలో ఆయన అనర్గళంగా మాట్లాడతారు. సినిమాల్లో పోలీసు పాత్రలు వేస్తూ ఎంత సమర్థంగా ఉండేవారో, రాజకీయాల్లోనూ అంతే సమర్థంగా ఉంటారని చెబుతారు. అయితే సంప్రదాయ రాజకీయ నాయకుల్లా ఆయన ఇంకా రాటుతేలలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఆ దిశగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాయి. పైగా ఆయన ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడయ్యారు. మరో పక్క సేవా కార్యక్రమాల్లో ఆయన ఇతర నేతలకంటే ముందుంటారు. అనాధ బాలల కోసం ఆయన జనసేనా శిశు భవన్ నిర్వహిస్తున్నారు.