ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరబోతోంది. కేంద్రంలో ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కారుగా పేరు సంపాదించబోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ రావడం, బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో ప్రజలకు మేలు చేసే చర్యలు కొనసాగించాలన్న ప్రధాని సంకల్పం నెరవేరబోతోంది…
నెహ్రూ తర్వాత మోదీనే…
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వరుసగా మూడు సార్లు గెలిచారు. తర్వాత ఎవ్వరూ అలాంటి రికార్డును సొంతం చేసుకోలేదు. ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధాని మోదీకి ఆ అవకాశం దక్కింది. దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే నేతగా మోదీ పేరు సంపాదించుకున్నారు. పదేళ్ల పాటు దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయంతో పనిచేసినందునే మోదీకి ప్రజలు మూడో సారి అధికారం ఇచ్చారని చెప్పాలి. ఉచిత రేషన్ కొనసాగింపు, గ్యాస్ సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు మోదీ చేరువయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా మధ్య తరగతి మెప్పు పొందారు.
దేశ ప్రజలకు కృతజ్ఞతలు…
సేవ చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టమని ఆయన విశ్లేషించారు. ఇకపై నూతన శక్తి, నూతన ఉత్సాహం, నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.ఆశీర్యదించి అధికారం ఇచ్చిన ప్రజల సంక్షేమానికి కృషిచేస్తామన్నారు. ఇదీ తన విజయం మాత్రమే కాదని, అహర్నిశలు పనిచేసి పార్టీని గెలిపించిన ప్రతీ ఒక్క కార్యకర్త ఈ విజయానికి అర్హుడని మోదీ ప్రశంసించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు అంకితభావంతో పనిచేసినందుకే తాము గెలిచే అవకాశం వచ్చిందన్నారు.
ఒడిసాలో బీజేపీ విజయం…
తూర్పు రాష్ట్రం ఒడిసాలో బీజేపీ జెండా పాతింది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 78 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. సీపీఎం 1, ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా ఒడిసాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.మిత్రుడైన నవీన్ పట్నాయక్‌పై మోదీ ఎన్నికల ప్రచారంలో యుద్ధం ప్రకటించారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం ఉందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. దానితో ఒడిసా ప్రజలకు పాలించే సత్తా నవీన్ కు ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేశారు. ఇప్పుడు 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందులో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంఖండ్, హరియాణా, గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ కూడా ఉన్నాయి. ఇది ముమ్మాటికీ మోదీ గొప్పదనమేనని చెప్పక తప్పదు..