బెంగాల్ పై బీజేపీ స్పెషల్ నజర్

పశ్చిమ బెంగాల్ ను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడి 42 లోక్ సభా స్థానాల్లో ప్రధాని మోదీ నేతృత్వ పార్టీకి 22 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి. అంతకంటే నాలుగు ఎక్కువే వస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కౌంటింగ్ ప్రక్రియకు అడ్డుపడే ప్రమాదం ఉందని బీజేపీ అనుమానిస్తోంది.అందుకే తమ ఏజెంట్లకు తగిన జాగ్రత్తలు చెబుతోంది..

ఈవీఎంలపై సీల్స్ పరిశీలించాలి…

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కు మరికొద్ది గంటలే ఉండటంతో కీలక సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని బీజేపీ సూచించింది. పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధివిధానాలను ప్రకటించింది. ఈవీఎంలపై ఉన్న వైట్ పేపర్లకు ఏ రకమైన ట్యాంపరింగ్ జరిగినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫామ్ 17ను పరిశీలించి అందులో ఎన్ని ఓట్లు రాశారో చూడటం మరిచిపోవద్దని బీజేపీ పెద్దలు సూచించారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు అడ్డు పడకుండా ఉండేందుకు బీజేపీ ఏజెంట్లంతా తమ ఐడీ కార్డులను ధరించి ఉండాలని చెప్పింది. ఓటింగ్ కేంద్రాలకు అరగంట ముందే చేరుకుని అక్కడి ఏర్పాట్లపై అవగాహన పెంపొందించుకోవాలని కూడా ఆదేశించింది.

కన్ను ఆర్పకుండా చూడండి…

కౌంటింగ్ రోజున అవిశ్రాంతంగా శ్రమించాలని బీజేపీ ఏజెంట్లకు నేతలు సూచించారు. ఎన్నికల సమయంలో తృణమూల్ పార్టీ సృష్టించిన హింసను గుర్తించుకోవాలని, అదే తరహాలో కౌంటింగ్ రోజున కూడా గొడవలు చేసేందుకు ప్రయత్నిస్తారని హెచ్చరించారు. అందుకే ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా వెంటనే పోలింగ్ అధికారులకు తెలియజేయడంతో పాటు, కోల్ కతాలోని బీజేపీ వార్ రూమ్ కు సమాచారం అందించాలని చెప్పారు. పోలింగ్ సమయంలో తృణమూల్ గూండాలు ఈవీఎంలను తీసుకెళ్లి నీళ్లలో పడేశారని, కౌంటింగ్ టైమ్ లో అలాంటి ఘటనలు జరగకుండా గట్టిగా ప్రతిఘటించాలని బీజేపీ తన కార్యకర్తలకు హితబోధ చేసింది. బెంగాల్ లో ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో భద్రతా బలగాలున్నందున వారి సేవలను వినియోగించుకోవాలని కూడా చెప్పారు..

ఎగ్జిట్ పోల్స్ పై మమత అక్కసు…

కౌంటింగ్ లో అవకతవకలు జరగకుండా చూడాలని బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఎగ్జిట్ పోల్స్ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కు విలువ లేదని ఆమె అంటున్నారు. రెండు నెలల ముందే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపొందించాయని అవి తప్పుడు పోల్స్ అని ఆమె మాట్లాడుతున్నారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అయితే మమత తీరుపై జనం నవ్వుకుంటున్నారు…