ఎన్డీయే అప్రతిహత విజయం దిశగా పయనిస్తోంది. మోదీ నేతృత్వ బీజేపీ తృతీయ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మోదీ అంటే ఇండియా.. ఇండియా అంటే మోదీ అనే స్థాయికి ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. తాజా ఎన్నికల్లో బీజేపీకి ఎదురులేని విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ప్రజలు మోదీ నామస్మరణ చేస్తున్నారని తేల్చేశాయి…
400 పార్ ఖాయమన్న పోస్ట్ పోల్ సర్వేలు…
మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. వరుసగా మూడో సారి తిరుగులేని విజయాన్ని అందుకో బోతున్నారని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బీజేపీ నినదించినట్లుగా ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. చార్ సౌ పార్ దిశగా సునాయాసంగా పయనిస్తోంది. మూడు సర్వేలు ఎన్డీయేకు 400 స్థానాలు దాటతాయని రిపోర్టులిచ్చాయి. మోదీ పాపులరిటీ ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిందని తేల్చేశాయి. న్యూస్ 24 -టుడేస్ చాణక్యా సర్వే ప్రకారం ఎన్డీయేకు 400 సీట్లు రావడమే కాకుండా ఇంకా పది నుంచి 15 స్థానాలు పెరగొచ్చు. ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం ఎన్డీయేకు 371 నుంచి 401 స్థానాలు వస్తాయి.
తెలంగాణలో రెట్టింపు అవుతున్న బీజేపీ సీట్లు
కర్ణాటకలో గత బలాన్ని బీజేపీ కొనసాగించుకునే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అక్కడి 28 లోక్ సభా స్థానాల్లో 25 వరకు ఎన్డీయేకి దక్కే వీలుంది. మరో పక్క తెలంగాణలోని 17 లోక్ సభా స్థానాల్లోనూ 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. ఈ సారి కనీసం సగం అంటే తొమ్మిది వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పది స్థానాలు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నాయి. తమిళనాడులో చాలా రోజుల తర్వాత ఖాతా తెరిచి రెండు స్థానాల వరకు దక్కించుకునే వీలుందని తెలుస్తోంది. కేరళలో కూడా ఫస్ట్ టైమ్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవబోతోంది. ఒకటి నుంచి రెండు స్థానాల వరకు తన ఖాతాలో వేసుకోబోతోంది…
బెంగాల్, బిహార్లో పెరుగుతున్న పరపతి
బెంగాల్ ను బీజేపీ కైవసం చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని వరుస సర్వేలు చెబుతున్నాయి. ఎందుకంటే బెంగాల్ ప్రజలు కమలం పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. 2019లో బీజేపీకి అక్కడ 18 లోక్ సభా స్థానాలు వచ్చాయి. ఈ సారి పార్టీ బలం 22కి పెరుగుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సునాయాసమవుతుంది. మరో పక్క ఒడిశాలోని 21 లోక్ సభా స్థానాల్లో బీజేపీకి 15 వరకు వస్తాయని పోస్ట్ పోల్ సర్వేల సారాంశం. దీని వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరే వీలుంది….