పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలి. రెండు వర్గాలు కొట్టుకుంటుంటే వారిని విడదీయాలి. తప్పు చేసిన వారిని దండించే క్రమంలో అవసరమైతే అరెస్టు చేయాలి. ఎక్కడా అల్లర్లకు అవకాశం లేకుండా చూడాలి. పశ్చిమ బెంగాల్ లో మాత్రం పోలీసు తీరు వేరుగా ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ప్రత్యర్థి బీజేపీపై తృణమూల్ దాడులు చేస్తుంటే ఖాకీలు వారికి మద్దతిస్తున్నారు…
ఏడో దశలో మరీ ఘోరం…
ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ అంటే ఎన్నికల హింసకు పెట్టింది పేరుగా చెప్పుకోవాలి. అక్కడ ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ప్రతీ సారీ కొట్టుకోవడం, చంపుకోవడం నిత్యకృత్యమైంది. చివరాఖరున ఏడో దశలో కూడా తృణమూల్ గూండాలు జనంపై పడి కొడుతున్నారు. రాష్ట్రంలోని 13 లోక్ సభా నియోజకవర్గాల్లో ఏడో దశ పోలింగ్ జరుగుతుండగా.. ఓటింగ్ కు 24 గంటల ముందు నుంచే హింసాకాండ మొదలైంది.
ఆ రెండు చోట్ల భారీ హింస…
బసీర్హాత్ నియోజకవర్గం పరిధిలోని సందేశ్ ఖళీ, జాధవ్ పూర్ లోక్ సభా ప్రాంతంలోని బాన్గార్ లో తృణమూల్ గూండాలు రెచ్చిపోయారు. కర్రలతో ప్రత్యర్థి పార్టీ వారిని కొట్టుకుంటూ భయభ్రాంతులను చేశారు. శుక్రవారం రాత్రి సందేశ్ ఖళీలో కొందరు మహిళలు తృణమూల్ గూండాలపై తిరగబడ్డారు. తృణమూల్ గూండాలు తమను కొడుతుంటే పోలీసులు వారికి సహకరించారని సందేశ్ ఖళీ మహిళలు ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురై, ప్రస్తుతం జైలులో ఉన్న షేక్ షాజహాన్ అనుచరులే తమపై దాడి చేశారని కూడా స్థానిక మహిళలు ఆరోపించారు. మహిళలు కూడా కర్రలు తీసుకుని తిరగబడటం వారి ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. పోలీసులపై కూడా మహిళలు తిరగబడేందుకు ప్రయత్నించడంతో వాళ్లు అక్కడ నుంచి పలాయనమయ్యారు…
వీడియోలు షేర్ చేసిన బీజేపీ నేతలు…
మహిళలు తిరగబడి నిరసన తెలియజేసిన వీడియోలను పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో పోలీసులు మిడ్ నైట్ ఆపరేషన్ నిర్వహించి జనాన్ని భయభ్రాంతులను చేశారని వారు ఆరోపించారు. బెర్మాజౌర్ అనే ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి జనాన్ని కొట్టినట్లుగా చీకట్లో తీసిన వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మరో పక్క పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లు కూర్చోకుండా చేయాలన్న తృణమూల్ ప్రయత్నం ఫలించలేదు..