మోదీ నాయకత్వంపైనే అక్కడి ప్రజల విశ్వాసం

ఉత్తరప్రదేశ్లోని 80 లోక్ సభా నియోజకవర్గాలు కూడా దాదాపుగా బీజేపీకి అడ్వాంటేజ్ గానే ఉన్నాయి. అక్కడి ప్రజలకు వరుసగా రెండు సార్లు బీజేపీ ప్రభుత్వం చేసిన మేలుతో కమలం పార్టీ పట్ల గౌరవాభిమానాలు పెరిగాయి. యూపీ ముస్లిం వర్గాలు కూడా కాషాయ సేనకే జై కొడుతున్నాయి. అందుకే ఉత్తర ప్రదేశ్ తో పాటు దేశంలో 400 స్థానాలు సాధిస్తామని కమలం ధీమాగా ఉంది. బీజేపీకి ఖచితంగా వచ్చే స్థానాల్లో బన్స్ గావ్ కూడా ఒకటని చెప్పక తప్పదు. అక్కడి పరిస్థితులు కమలానికి అనుకూలంగా ఉన్నాయి….

కమలేష్ పాశ్వాన్ కే మళ్లీ టికెట్….

బన్స్ గావ్ ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అది డియోరియా, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు దాని క్రిందకు వస్తాయి. జూన్ 1న అక్కడ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ కమలేష్ పాశ్వాన్ కే బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చింది. 2009 నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన నాలుగో సారి విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తల్లి సుభావతీ పాశ్వాన్ కాలం నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. గత ఎన్నికల్లో కమలేష్ కు 56 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన బలం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి.

డబుల్ ఇంజిన్ సర్కారే విజయ రహస్యం…

అక్కడ కమలేష్ పాశ్వాన్ పరపతి కంటే మోదీ, యోగి కాంబినేషనే సూపర్ హిట్ అవుతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ప్రజలకు అంతా మేలు జరిగి… బన్స్ గావ్ జనానికి బీజేపీ పట్ల విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సదల్ ప్రసాద్ పై కనీసం లక్షన్నర మెజార్టీతో గెలుస్తానని పాశ్వాన్ చెబుతున్నారు. గెలిచేందుకు మోదీ పరపతి ఒకటే చాలని పాశ్వాన్ అంగీకరిస్తున్నారు.

మెరుగుపడిన శాంతి భద్రతలు

యోగి ప్రభుత్వం వచ్చాక బన్స గావ్ తో పాటు యూపీ అంతటా శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని అక్కడి ప్రజల నమ్మకం. పైగా పేదలకు ఉచిత రేషన్ అందించడం ద్వారా ఆకలి చావులు లేకుండా చేశారు. ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్ లాంటివి బన్స్ గావ్ ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరగడానికి దోహదం పడ్డాయి. వరద నివారణ చర్యల్లో బీజేపీ ప్రభుత్వం భేషుగ్గా పనిచేసిందని జనమే చెబుతున్నారు. కొత్త రోడ్లు నిగనిగలాడుతున్నాయి. నియోజకవర్గంలో 23 శాతం దళిత ఓట్లు ఉండగా..వాటిలో 90 శాతం పైగా తమకే వస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది. యాదవులు కాని ఓబీసీలంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అక్కడ బీఎస్పీ కేవలం 15 శాతం ఓట్లతో బలహీనంగా ఉన్న కారణంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతోంది. కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీకి సాటిరారని 2019 నాటి గణాంకాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో 17 లక్షల 40 వేల మంది ఓటర్లున్నారు….