ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని మహిళలను అంటాం. ఓటర్ల జాబితాలోనూ ప్రతీ చోట మహిళలు యాభై శాతం ఉంటారు. కొన్ని చోట్ల పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉంటున్నారు. లోక్ సభకు ఏడో దశ పోలింగ్ లోనూ మహిళా ఓటర్లే కీలకమవుతారని మరోసారి చెప్పక తప్పదు. మహిళా సీఎం మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా మహిళలే విజేతలను నిర్ణయిస్తారు.
లైంగిక దాడితో ఆగ్రహం..
బెంగాల్ ఏడో దశ ఎన్నికల్లో బసీర్హాత్ లోక్ సభా నియోజకవర్గం చాలా కీలకమైనదిగా చెప్పాలి. గిరిజన మహిళలపై లైంగిక దాడి జరిగిన సందేశ్ ఖళీ ప్రాంతం ఆ లోక్ సభా నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ఓటింగ్ కు ఇంకా రెండు రోజులు కూడా లేని టైమ్ లో కేసుల వ్యవహారం కూడా చర్చకు వస్తుంది. ఈడీ సిబ్బందిపై తృణమూల్ నేత షేక్ హాహజాహ్ అతని ఆరుగురు అనుచరులు జరిపిన దాడికి సంబంధించి ఇప్పుడు చార్జ్ షీటు దాఖలు కావడంతో రాష్ట్ర అధికార పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది..
దీదీపై మహిళల ఆగ్రహం..
మహిళల మాన ప్రాణాలు కాపాడటంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలున్నాయి. తమపై దాడులు జరగకుండా చూసేందుకు దీదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆగ్రహం చెందుతున్నారు. సందేశ్ ఖళీలో ఇళ్లలోంచి బయటకు లాగి కొట్టినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. అవినీతి, పరిపాలనా లోపాలు, అరాచకం, లైంగిక వేధింపులు రోజువారీ జరుగుతున్నా ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి సందేశ్ ఖళీలో మాత్రమే కాకుండా రాజధాని నగరం కోల్ కతా చుట్టుపక్కల కూడా ఉందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
నగదు బదిలీతో మాయ చేయాలనుకుంటున్న మమత
తృణమూల్ కాంగ్రెస్ మసీ పూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నిస్తోంది. మహిళలను ఆకర్షించే దిశగా కొంతకాలం క్రితం లక్ష్మీ భండార్ పథకాన్ని అమలు చేసింది. దీని వల్ల మహిళల ఖాతాలోకి నగదు వచ్చి చేరుతుంది. మధ్యప్రదేశ్లో అమలవుతున్న లాడ్లీ బెహన్ స్కీము లాంటిదే లక్ష్మీ భాండార్ అని చెప్పక తప్పదు. ఇలాంటి కొన్ని స్కీముల వల్ల పిల్లల చదువులకు ప్రయోజనం కలుగుతుందని మహిళలు అంగీకరిస్తున్నారు. ప్రతీ మహిళ ఖాతాలో వెయ్యి రూపాయలు జమ అవుతున్నాయి. అయితే భద్రత లేకుండా డబ్బులు తీసుకుని ఏం చేయాలని బెంగాల్ మహిళలు ప్రశ్నిస్తున్నారు. రౌడీలు మీద పడి కొడుతుంటే పోలీసులు స్పందించడం లేదని వాళ్లు చెబుతున్నారు. రాజకీయ నాయకుల్లా తాము ఉద్యమాలు చేయలేమని, రోడ్ల మీద తిరిగితే తిండి గడవదని వెల్లడిస్తున్నారు. తమ మనోగతాన్ని పోలింగ్ రోజున ఈవీఎంలో నిక్షిప్తం చేస్తామని అంటున్నారు. వాళ్ల ఆలోచన ఏమిటో పెద్దగా చెప్పాల్లిన పనిలేదు..