హిందూపురం.. టీడీపీకి మొదటి నుంచి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవలేదు. బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. హ్యట్రిక్ సాధించాలనే లక్ష్యంతో పని చేశారు. YCP ఈ సారి మహిళా నేతను బరిలోకి దింపింది. హిందూపురంలో టీడీపీని ఢీకొట్టడం.. అందులోనూ నందమూరి నటసింహం బాలకృష్ణ ఓడించడం అంటే ఆషామాషీ కాదు. 30 ఏళ్లుకు పైగా అక్కడ తెలుగుదేశం పార్టీని టచ్ చేసిన దాఖలాలు లేవు. అంతలా ఈ నియోజకవర్గంలో టీడీపీకి పట్టుంది. అందులోనూ బాలయ్య లాంటి గట్టి అభ్యర్థిని ఓడించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.
దారికి రాని వైసీపీ గ్రూపు గొడవలు
హిందూపురంలో స్థానిక వైసీపీ నేత నవీన్ నిశ్చల్‌కు మంచి పేరుంది. గతంలో ఆయన.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయాడు. ఆ సానుభూతి కూడా ఉంది. కానీ.. నవీన్‌కు టికెట్ దక్కకపోవడంతో పార్టీపై ఆయన గుర్రమన్నారట. ఏదో రకంగా నవీన్‌ను వైసీపీ అధిష్టానం బతిమాలి దారిలోకి తెచ్చుకుందట. మరోనేత.. దివంగత చౌలురు రామకృష్ణారెడ్డి వర్గం కూడా జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చెల్లెలు టికెట్ కోసం.. ఓ రేంజ్‌లో పోరాడి సైలెంట్ అయిపోయారు. వారు కూడా.. ఫ్యాన్ పార్టీ కోసం పెద్దగా పనిచేయలేదనే వాదనలు ఉన్నాయి.
టీడీపీలో చేరిన ఇక్బాల్
బాలకృష్ణ ప్రత్యర్థి అయిన మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో బాలకృష్ణ తరపున ప్రచారం చేశారు. ముస్లిం వర్గంలో అంతో..ఇంతో పట్టున్న నేతను కూడా వైసీపీ చేజార్చుకుందనే టాక్ అప్పట్లో నడించింది. మున్సిపల్ ఛైర్మన్ ఇంద్రజ కూడా పార్టీలో అంటీముట్టనట్టు వ్యవహరించారట. తన భర్తను కేసుల్లో ఇరికించడంతో తప్పక సహకరించాల్సి వచ్చినా..లోలోపల అభ్యర్థి దీపికాకు మాత్రం సహకరించలేదనే ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణను ఓడించాలంటే పార్టీ మొత్తం కష్టపడి ఒకే తాటిపై పనిచేయాలని అధిష్టానం నచ్చచెప్పినా.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవని తెలుస్తోంది.
టీడీపీ ఉన్నప్పుడు పనులు చేయడం బాలకృష్ణకు ప్లస్
తెలుగుదేశం ఆవిర్భావం తర్వత మూడు సార్లు గెలిచిన ఎన్టీఆర్ హిందూపురంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. డు బాలయ్య కూడా 560 కోట్ల ఖర్చుతో.. 120 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి.. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీరు తీసుకువచ్చారు. అదే.. 2019 ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి దోహదం చేసిందనేది రాజకీయ నిపుణుల మాట. ఇప్పుడు కూడా అది ప్లస్ అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.