దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయడం లేదు. కొన్నింటినీ తమ పొత్తు భాగస్వాములకు వదిలేసింది. గట్టిగా మద్దతిచ్చి గెలిపించాలని స్థానికంగా ఉన్న తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. ఆయా నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించింది. ఆ క్రమంలో అక్కడ విజయావకాశాలను మెరుగు పరుచుకుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉత్తర ప్రదేశ్లోని ఘోసీ కూడా ఒకటి.రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలంటే అక్కడ కూడా గెలిచి తీరాలి కదా…..
బరిలో అరవింద్ రాజబహార్
ఘోసీలో జూన్ 1న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీఎస్పీకి చెందిన అతుల్ రాజ్ ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉన్నారు. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బాలకృష్ణ చౌహాన్ ను బరిలోకి దింపారు. ఇండియా గ్రూపు తరపున సమాజ్ వాదీ పార్టీ నేత రాజీవ్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఇక ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ)కి చెందిన అరవింద్ రాజబహార్ బరిలో ఉన్నారు. ఆయన స్థానికంగా బలమున్న ఓం ప్రకాష్ రాజబహర్ తనయుడు.
సమన్వయంతో ముందుకు…
ఓం ప్రకాష్ రాజబహార్ అంటే స్థానిక బీజేపీ కేడర్ కు కొంత వ్యతిరేకత ఉంది. ఆయన గతంలో తమను దూషించారని వాళ్లు గుర్తు చేస్తుండేవారు. అయితే పార్టీ పెద్దలు రంగంలోకి దిగి మీటింగులు పెట్టి పోత్తు ధర్మాన్ని, పార్టీ అనివార్యతలను వివరించారు.దానితో కార్యకర్తలంతా ఇప్పుడు అరవింద్ రాజబహార్ కు సహకరిస్తున్నారు. కర్ర గుర్తుకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు.
మోదీ, యోగి పరపతితో….
రాజబహార్ గతంలో పోటీ చేసినప్పుడు రెండు లక్షల వరకు ఓట్లు వచ్చాయి. ఘోసీ నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల ఓట్లున్నాయి. ఈ సారి కనీసం పది లక్షల ఓట్లు రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎస్బీఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ కేడర్ ను ఆదేశించింది. దళిత, ఓబీసీ వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పనితీరుతో జనం సంతృప్తిగా ఉండటం ఎన్డీయేకు కలిసొచ్చే అంశం. మోదీ పట్ల తమకు ఎక్కడ లేని గౌరవం ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. యోగీ పాలనలో ఉద్యోగావకాశాలు పెరిగాయని జనం చెప్పుకుంటున్నారు. మూసివేతకు గురైన మిల్లులను తెరిపించేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. కొత్త పరిశ్రమలు కూడా నియోజకవర్గానికి వస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ కూడా బాగానే పెరిగింది. త్వరలో అక్కడో వైద్య కళాశాల రాబోతోంది.