గుడివాడలో కొడాలి నానికి చెక్ పడినట్లేనా ? గెలుపుపై పందేలు ఎందుకు లేవు ?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గుడివాడ ఓకటి. పోలింగ్ రోజున వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుడివాడ వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది. పార్టీలో ఎప్పుడూ అవసరమైన దానికంటే దూకుడు ప్రదర్శిస్తూ, అన్నీ తానై వ్యవహరించే కొడాలి నాని పోలింగ్ రోజు చివరి గంటల వరకు కనిపించకుండా పోయారు. సాధారణంగా పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్ధయినా నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులను, అభిమానులు కలుస్తూ ఓటింగ్ సరళని పరిశీలిస్తుంటారు. కార్యకర్తలందరూ ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడతారు.

పోల్ మేనేజ్ మెంట్ పట్టించుకోని కొడాలి నాని

కాని ఓట్ల పండుగ నాడు కొడాలి నాని ఉదయం నుంచి ఇంటికే పరిమితమయ్యారు . టీడీపీలో 2 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన నాని, తర్వాత వైసీపీ నుంచి మరో రెండు సార్లు గెలిచి రెండున్నరేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీలో చేరిన నాటి నుంచి టీడీపీ పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్‌లపై అభ్యంతకర పదజాలంతో విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్నారు. దానికి తోడు ఆయనపై ఉన్న ఆరోపణలు, ఆయన గ్యాంగ్ ఆరాచకాలతో నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి

మరోవైపు టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఆయనకు ఈ సారి బలమైన ప్రత్యర్ధిగా మారారు. ఆ క్రమంలో గుడివాడ నుంచి అయిదో సారి గెలవడం అంత ఈజీ కాదన్న భావనతోనే ఆయన ప్రజలకు ముఖం చాటేసారన్న ప్రచారం జరిగింది.ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు, కనీసం పోలింగ్ బూత్‌ల పరిశీలన కూడా చేయకపోవడంతో అప్పటి వరకు తలో మాట అనుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కూడా కొడాలి నాని తన సహజశైలికి భిన్నంగా ముభావంగా వ్యవహరించడంతో రకరకాల చర్చలు తెరమీదకొస్తున్నాయి.

కొడాలి నాని ఇచ్చిన డబ్బులు నొక్కేసిన నేతలు

ఎన్నికల విషయంలో కొడాలి నాని వ్యవహారం నింపాదిగా ఉంది. ఎలక్షనీరింగ్ కూడా పర్ ఫెక్ట్ గా చేయలేకపోయారు. డబ్బులు పంపిణీ చేయలేదని…డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొడాలి నాని సోదరుడు వైసీపీ క్యాడర్ పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఓ అనచరుడు వీడియో విడుదల చేశారు. తాము తినలేదని.. తమను అనుమానించి ప్రశ్నిస్తున్నారని అసలు.. డబ్బు దాచుకున్న వారు వేరే ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అందర్నీ కొడాలి నాని కల్యాణమండపానికి పిలిచి కోటింగ్ ఇవ్వాలని అంటున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో గుడివాడలో కొడాలికి ఆశలు తగ్గిపోయాయని అంటున్నారు.