సుష్మా స్వరాజ్ కూతురిపైనే కొత్త ఢిల్లీ ఆశలు

ఢిల్లీలోని ఏడు లోక్ సభా నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపిస్తున్నా.. న్యూ ఢిల్లీ (కొత్త ఢిల్లీ) నియోజకవర్గం ఈ సారి ప్రత్యేకతను సాధించుకుంది. అక్కడ ఎలాగైనా గెలవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. సోమ్ నాథ్ భారతీని అక్కడ పోటీ చేయిస్తోంది. బీజేపీ తరపున దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ బరిలోకి దిగారు. దీనితో అందరి దృష్టి న్యూ ఢిల్లీ నియోజకవర్గంపై పడింది.

ఎన్నో ప్రత్యేకతలున్న నియోజకవర్గం….

ఈ నెల 25న పోలింగ్ జరిగే న్యూ ఢిల్లీ నియోజకవర్గం పరిధిలో పది అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇంతవరకు బీజేపీ ఎంపీగా మీనాక్షి లేఖీ ఉన్నారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా సేవలందిస్తున్నారు. ఈ సారి ఆమె పోటీకి దూరంగా ఉండటంతో బన్యూరి స్వరాజ్ ను రంగంలోకి దింపారు. ఆమెతో పాటు ఆప్ అభ్యర్థి సోమ్ నాథ్ భారతి కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. 1951లో ఏర్పాటైన న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో సంపన్నులు, మధ్య తరగతి వర్గం వాళ్లు కలిసి ఉంటారు. ఆ నియోజకవర్గం పరిధిలోనే పార్లమెంటు, సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రపతి- ప్రధాని అధికారిక నివాసాలు ఉన్నాయి. ఖాన్ మార్కెట్, డిఫెన్స్ కాలనీ, కన్నాట్ ప్లేస్, గ్రీన్ పార్క్, హౌస్ కాస్, లజ్ పత్ నగర్ కూడా అక్కడే కనిపిస్తాయి.

కుల రాజకీయాలకు దూరం..

దేశంలో కుల రాజకీయాలకు దూరంగా ఉంటే బహుకొద్ది నియోజకవర్గాల్లో న్యూ ఢిల్లీ లోక్ సభ కూడా ఒకటని చెప్పక తప్పదు. రాజ్యాంగ అధికరణం 370 రద్దు, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, కేజ్రీవాల్ అరెస్టు లాంటి అంశాలు ప్రచారంలో ప్రధాన భూమిక వహించాయి. ఆ నియోజకవర్గం ప్రజలు బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వస్తున్నారు. భారతీయ జన సంఘ్, జనతా పార్టీ, బీజేపీ – అలా ఏదోక రూపంతో విజయం సాధిస్తూ వచ్చారు. 40 ఏళ్ల బన్సూరి స్వరాజ్, బీజేపీ తరపున అక్కడ పోటీ చేస్తున్న అతి పిన్న వయసు అభ్యర్థిగా చెప్పుకోవాలి. మీనాక్షి లేఖీ.. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఆమెను మార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ సారి మోదీ కీ గ్యారెంటీతో పాటు సుష్మా స్వరాజ్ కు ఉన్న మంచి పేరు బన్సూరిని గెలిపిస్తాయని అంచనా వేస్తున్నారు.

కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధి

జీ-20 సదస్సు కోసం న్యూ ఢిలీ ప్రాంతాన్ని కేంద్రం సుందరీకరించింది. ఇప్పుడా పని ఎన్నికల్లో ఉపయోగపడుతోంది. మార్కెట్లను అభివృద్ధి చేసి అక్కడ మల్టీలెవెల్ పార్కింగుకు ఏర్పాట్లు చేశారు. వ్యాపార వర్గాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తాయి. వాళ్లంతా ఏకమొత్తంగా బన్సూరికి ఓటేస్తారని చెబుతున్నారు. స్థానికతపై చెలరేగిన వివాదానికి కూడా బన్సూరి వివరణ ఇచ్చారు. సుష్మా స్వరాజ్ ఎప్పుడూ విదిశలో పోటీ చేసేవారని వాళ్లు ఇక్కడి వాళ్లు కాదని ఆప్ అభ్యర్థి సోమ్ నాథ్ భారతీ ప్రచారం చేశారు. దాన్ని కౌంటర్ చేసిన బన్సూరి.. తాను చిన్నప్పటి నుంచి ఢిల్లీలోనే పెరిగానని, న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పారు.