ఎపిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయి. రాళ్లు రువ్వుకోవడాలు, కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లు చేతపట్టుకొని రోడ్లపై స్వైర విహారం చేస్తూ రాళ్ల దాడులకు పార్టీల వారీగా వైరి వర్గాలు దిగాయి. వందల మందికి గాయాలయ్యాయి. తర్వాత కూడా ఉద్రిక్తత తగ్గలేదు.
పల్నాడులో భద్రతా ఏర్పాట్లు ఏవి ?
పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే తాడిపత్రిలోనూ గతంలో ఎన్నికల గొడవలు జరిగాయి. తెలిసి కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశమైంది. కనీసం మునిసిపల్ ఎన్నికల్లో తీసుకున్న చర్యలు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోకపోవడం పలు సందేహాలు తావిస్తోంది. గతంలో ఎన్నికల గొడవల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని వారిని బైండోవర్ చేస్తారు. ఇది సాధారణ అంశం. అయితే ఆ పనికూడా పోలీసులు చేయలేదు. నేరస్తులను వెచ్చల విడిగా వదిలేశారు.
ఈవీఎంలను పగులగొట్టినా కేసుల్లేవు !
పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈవిఎం ధ్వంసం విషయం వీడియో బయటకు వచ్చే వరకు పోలీసులకు కూడా తెలియలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. అధికార పార్టీ వత్తిడులకు పోలీసులు తలవంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందుకింత నిర్లక్ష్యం
ఈ ఎన్నికల్లో హింస జరుగుతుందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ముందస్తు చర్యలు అసలు తీసుకోలేదనిపిస్తుంది. పోలీసులను కాస్త ఎక్కువ మందిని తెప్పించుకోవాల్సింది. సామాన్య ఓటరును భయపెట్టకుండా నేరస్తులను భయపెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు పెట్టిన కేసుల్లో ఎన్నికల చట్టాలకు సంబంధించిన సెక్షన్స్ ఎందుకు వేయలేదనేది కూడా చర్చగా మారింది. నేరస్తుల వద్ద మర్యాదగా ఉంటే సరిపోతుందా? సాధారణ ఓటర్ల పట్ల మర్యాదగా పోలీసులు వ్యవహరించాలి. నేరస్తుల వద్ద కఠినంగా వ్యవహరించాలి. కానీ పోలీసుల తీరు భిన్నంగా ఉంది.