ఆరో దశలోనూ బీజేపీ హవా – కాంగ్రెస్‌కు నాలుగైదు సీట్లు కష్టమే !

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 25న ఆరో దశ, జూన్‌1న ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడత పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

57 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరో దశలో పోలింగ్

దేశ రాజధానిలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో పాటు హర్యానాలోని 10 స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది. ఈ 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీయే కూటమి గెలచుకుంది. ఆరో దశ ఎన్నికలు జరగనున్న 57 లోక్‌సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్‌ ఒక్కసీటు గెలుచుకోలేదు. అలాగే మరోవైపు ప్రాంతీయ పార్టీలకు ఆరో దశ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. బీజేపీ హవా కొనసాగుతూండటంతో వీరెవరికి మరో చాన్స్ వస్తుందని అనుకోవడం లేదు.

ఆరో దశలో ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు?

ఆరో దశలో ఉత్తరప్రదేశ్‌లో 14, బీహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, ఢిల్లీలో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది, జార్ఖండ్‌లో నాలుగు, ఒరిస్సాలో ఆరు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ 57 లోక్‌సభ స్థానాల్లో 2019లో 40 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. బిఎస్పీ నాలుగు, టిఎంసి మూడు, బిజెడి 4, జెడియు మూడు, ఎల్‌జెపి ఒకటి, ఎజెఎస్‌యు ఒకటి స్థానంలో విజయం సాధించాయి. ఎస్పీ కూడా ఒక్క సీటు గెలుచుకుంది. హర్యానా, ఢిల్లీలో బిజెపి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి ఢిల్లీ, హర్యానాలో బిజెపి హావా ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి.

యుపిలో గట్టి పోటీ
ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌, ఫుల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, అంబేద్కర్‌నగర్‌, శ్వస్తీ, దుమ్రియాగంజ్‌, బస్తీ, సంత్‌ కబీర్‌నగర్‌, లాల్‌గంజ్‌, జాన్‌పూర్‌, అజంగఢ్‌, ఫిష్‌ సిటీ, భదోహి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బిజెపి 9 సీట్లు, బిఎస్పీ 4, ఎస్పి ఒక సీటు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఎస్పి, బిఎస్పి కలిసి పోటీ చేయగా.. ఈసారి కాంగ్రెస్‌, ఎస్పి కలిసి పోటీచేస్తున్నాయి. బిఎస్పి ఒంటరిగానే బరిలోకి దిగింది. అన్ని చోట్లా బీజేపీ ముందంజలో ఉంది. బీహార్‌లోని వాల్మీకి నగర్‌, పశ్చిమ చంపారన్‌, తూర్పు చంపారన్‌, శివర్‌, వైశాలి, గోపాల్‌గంజ్‌, మహారాజ్‌గంజ్‌, సివాన్‌ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బిజెపి నాలుగు, జెడియు మూడు, ఎల్‌జెపి ఒక సీటు గెలుచుకున్నాయి. ఈ సారి బీజేపీ, జేడీయూ కలవడంతో క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది.

బెంగాల్ లోనూ బీజేపీ హవా

పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2019లో ఈ ఎనిమిది సీట్లలో బిజెపి ఐదు సీట్లు గెలుచుకోగా, టిఎంసి మూడు సీట్లు గెలుచుకుంది. ఒరిస్సాలోని సంబల్‌పూర్‌, కెంజోర్‌, ధెంకనల్‌, కటక్‌, పూరి, భునేశ్వర్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బిజెపి రెండు సీట్లు గెలుచుకోగా, బిజెడికి నాలుగు సీట్లు గెలుపొందింది. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, హర్యానాలోని మొత్తం పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈసారి ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. బిజెపి ఏడుగురు సిట్టింగ్‌ ఎంపిల్లో ఆరుగురికి టికెట్లు నిరకారించింది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది . దీంతో మరోసారి బీజేపీ గాలి వీయడం ఖాయంగా కనిపిస్తోంది.