అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి – ఇక అరెస్ట్ !

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం పగులగొడుతూ వీడియోలో దొరికిపోయారు . మాచర్ల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది ఉందని ఎవరైనా చెప్పగలరా ?. మాచర్ల మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డుకు ఎన్నిక జరగలేదు.. .మొత్తం ఏకగ్రీవం అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలు దేనికీ ఎన్నికలు జరగలేదు. పోలీసులు, వ్యవస్థ పూర్తిగా పిన్నెళ్లి రౌడీయిజానికి దాసోహం అయ్యాయి. అప్పట్నుంచి ప్రారంభమైన ఈ ఘోరాలు .. సాధారణ ఎన్నిల్లోనూ జరిగాయి.

సిట్ నివేదిక సమర్పణ తర్వాత కీలక పరిణామాలు

పోలింగ్ అనంతర హింసపై ఏర్పడిన సిట్ తన నివేదిక సమర్పించింది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఇంకా బయటకు రాలేదు. కానీ అల్లర్లకు పాల్పడిన వారు మాత్రం హాయిగా ఉన్నారు. బాధితులు మాత్రం కేసులకు గురై జైళ్లలో పడి మగ్గుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి సోదరులు అందరూ హాయిగా ఉన్నారు. వీరంతా నేరుగా విధ్వంసానికి పాల్పడిన వాళ్లే.
మాచర్ల నియోజకవర్గంలో బీహార్ ను మించిన అరాచకం చేశారు. పోలింగ్ బూత్‌లు ధ్వంసం చేశారు. తలలు పగలగొట్టారు. వంద మందితో పిన్నెల్లి సోదరుడు కారంపూడిలో చేరిన అరాచకం వీడియోలు పక్కాగా ఉన్నాయి.

పిన్నెల్లికి పోలీసులు సహకరించారా ?

గృహనిర్బంధంలో ఉండాల్సిన ఎమ్మెల్యేను పోలీసులే వదిలేశారు. ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఆయన అలా చేశారు.. ఇలా చేశారని అంటున్నారు. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు అమర్చారు. మొత్తం పధ్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్ క్యాస్టింగ్ చేశారు. ఇతర నియోజకవర్గాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాలు పెట్టారు. అయినా వైసీపీ నేతలు లెక్క చేయలేదు. ఇష్టం వచ్చినట్లుగా మొత్తం పగలగొట్టారు. దాడులు చేశారు. దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు పిన్నెల్లి ఈవీఎం పగులగొట్టిన క్లిప్ బయటకు వచ్చింది. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ.. మొత్తం అన్ని బూత్‌ల సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

పిన్నెల్లి అరెస్టు తప్పదా ?

పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. కానీ ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇవాళో రేపో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.