వారణాశిలో ఏపీ బీజేపీ నేతలు ప్రచారంచేస్తున్నారు. సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ ప్రధాని మోదీ మెజార్టీ పెంచేందుకు తెలుగువారిని కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రచార బృందంలో సభ్యుడిగా నియమితులైన వెంటనే వారు వారణాశికి చేరిపోయారు.
వారణాశిలో పెద్ద ఎత్తున తెలుగు వారు
వారాణశిలో తెలుగువారు ఎక్కడ చూసినా ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తారు. మఠాలను నిర్వహించి.. భోజన, వసతి సౌకర్యాలు చూస్తూంటారు. చాలా మంది అక్కడే స్థిరపడ్డారు కూడా. వారందరికీ అక్కడే ఓటు హక్కు ఉంటుంది. మొదటి నుంచి వారు అక్కడే ఉన్నా… పూర్తిగా ఆథ్యాత్మికంగా ఉండటం వల్ల ఓటు వినియోగంపై పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఓటు వేయడం కూడా దైవసంకల్పమేనని అందర్నీ ఒప్పించి ఓటింగ్ శాతం పెంచేందుకు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల వారిని అందర్నీ సమన్వయం చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షునిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కాశీలో దక్షిణాది రాష్ట్రాల వారినందర్నీ ఏకం చేసి… మోదీ మద్దతుగా భారీగా ఓటింగ్ లో పాల్గొనేందుకు మోటివేట్ చేస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారంలో పాల్గొన్నందున ఆ పరిచయాలతో దూసుకెళ్తున్నారు. చివరి విడతలో వారణాశిలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకూ ప్రచారం చేసే అవకాశం ఉంది.
మోదీ కోసం పని చేయాలని ఎంతో మంది ప్రయత్నం
ప్రధాని మోదీ కోసం వారణాశిలో పని చేయాలని ఎంతో మంది అనుకుంటారు. అయితే హైకమాండ్ ప్రభావవంతంగా పని చేసే అతి కొద్ది మందికే అవకాశం ఇస్తుంది. కొద్ది మంది నేతల్లో విష్ణువర్దన్ రెడ్డి ఒకరు. ఏపీ ఎన్నికల్లోనూ ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. హెలికాఫ్టర్ కూడా కేటాయించారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ తీరిక లేకుండా ప్రచారం చేశారు.