స్వాతి మాలివాల్ ను అన్నివైపులా టార్గెట్ చేసిన ఆప్…

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు అనుకున్నంత జెంటిల్మెన్ అయితే కాదు. ఇప్పుడిప్పుడే వారి దుశ్చర్యలు బయటపడుతున్నాయి. అవినీతి కేసుల్లో అరెస్టుల తర్వాత వారిలో అసహనం టన్నుల కొద్దీ పెరిగిపోతోంది. ఎదురుతిరిగితే సొంత పార్టీ వారినైనా కొట్టి చంపేందుకు వాళ్లు వెనుకాడరని స్వాతి మాలివాల్ ఘటన నిరూపితమైంది. ఇప్పుడు ఆమెను తీవ్రంగా వేధించేందుకు సైతం ఆప్ నేతలు వెనుకాడటం లేదు…

పాత ఎఫ్ఐఆర్ వ్యవహారంతో వేధింపులు

కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన తర్వాత పలుకరించేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లిన స్వాతి మాలివాల్ పై దౌర్జన్యం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్ ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమెను కొట్టారు. ఈ క్రమంలో ఆమె గాయపడటమే కాకుండా బట్టలు కూడా చనిగిపోయాయి. తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింతగా కసి పెంచుకున్నారు. ఆమె ఆప్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఐనా సరే ఇప్పుడు స్వాతిపై ఆప్ నేతలు సోషల్ మీడియా ట్రోల్స్ మొదలు పెట్టారు. ఆమెపై ఉన్న పాత ఎఫ్ఐఆర్ ఆధారంగా విమర్శలు చేస్తున్నారు. ఆమె అవినీతిపరురాలని అందుకే 2016లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఆరోపిస్తున్నారు. నిజానికి స్వాతిపై ఎలాంటి అభియోగాలు నిరూపితం కాలేదు. ఏడాదిన్నర పాటు ఎఫ్ఐఆర్ పై కోర్టు స్టే తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని వదిలేసింది. ఆ సంగతి తెలిసి కూడా ఆప్ నేతలు తనను ట్రోల్ చేస్తున్నారని స్వాతి మాలివాల్ ఆరోపిస్తున్నారు…

బంధువులను కూడా వదలడం లేదు..

ఆప్ నేతలు స్వాతి బంధువులను కూడా వదలడం లేదు. వారి పేర్లను, కార్ల నెంబర్లను సోషల్ మీడియాలో ఉంచుతూ వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారని స్వాతి ఆవేదన చెందారు. అది తన బంధువుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. స్వాతి వ్యక్తిగత వీడియోలు ఏమైనా ఉంటే వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని ఆప్ నేతలందరికీ ఆదేశాలు అందాయి. దానిలో ఆమె బంధువులంతా భయంతో బక్కచిక్కిపోయారు. ఆప్ తమపై పగబట్టిందని వారంటున్నారు….

బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు…

కొందరు ఆప్ నేతలతో తనకున్న విభేదాలకు, కేంద్రంలోని అధికార బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్వాతి మాలివాల్ కుండబద్దలు కొట్టారు. బీజేపీ వారితో తాను ఎన్నడూ టచ్ లో లేనని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సలహా మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ రెండు పర్యాయాలు తనను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారన్నారు. ఇప్పుడు అధికారంతో కన్నుమిన్ను కానరాకుండా కొందరు ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారని, వారిని కోర్టుకు లాగడం మాత్రం ఖాయమని ఆమె వెల్లడించారు. తాను ఎవరికీ ద్రోహం చేయలేదన్న నిజం త్వరలోనే తెలుస్తుందన్నారు.