బీజేపీకి యూపీలో వచ్చినన్ని సీట్లు కూడా కష్టమే – దేశంలో దిగజారిపోతున్న కాంగ్రెస్ !

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ‘400 ప్లస్‌’ స్థానాలు సొంతం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్ని సీట్లు సాధిస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. 125 స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కానీ కాంగ్రెస్ కు ఎక్కడ సీట్లు వస్తాయో మాత్రం ఇలా లెక్కలేసేవారు చెప్పలేకపోతున్నారు.

కాంగ్రెస్ 60 సీట్లు దాటితే గొప్ప !

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 145 స్థానాలు లభించగా బీజేపీ 138 సీట్లు గెలుచుకుంది. అప్పుడు దేశంలో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే అనేక పార్టీలు బీజేపీతో కాకుండా కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 328 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది, దేశ చరిత్రలో కాంగ్రెస్‌ ఇన్ని తక్కువ స్థానాలకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌ పార్టీ 2014లో 44, 2019లో 52 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 2014లో 282, 2019లో 303 సీట్లు పొందింది.

హిందీ రాష్ట్రాల్లో మరింత దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి

ఉత్తరాన ఉన్న హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ మొదలుకొని పశ్చిమాన, దక్షిణాన ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్నాటక వరకూ 2019లో కాంగ్రెస్‌ దాదాపు తన సీట్లన్నింటినీ బీజేపీకి కోల్పోయింది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ 241 స్థానాలకు పోటీ చేస్తే గెలుచుకున్నది కేవలం తొమ్మిది మాత్రమే. ఇప్పుడు కూడా కొత్తగా ఆయా రాష్ట్రాల్లో పుంజుకున్న పరిస్థితులు ఏమీ లేవు. నాలుగైదు సీట్లు ఎక్కువ సాధిస్తే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారింది. యూపీలోనే బీజేపీకి 70 లోక్ సభ సీట్లు వస్తాయి. దేశమొత్తం మీద కాంగ్రెస్ కు ఆ సీట్లు వస్తే గొప్పే.

400 ప్లస్ నినాదంతో కాంగ్రెస్‌కు చుక్కలు

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో రెండు వారాల సమయం ఉంది. ఫలితాలపై రోజురోజుకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఎన్ని స్థానాలు లభిస్తాయన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని, మిత్రపక్షాలకు 30కిపైగా సీట్లు వస్తాయని అంచనా ే వేస్తున్నారు. దీనికి కారణం దక్షిణాదిలో బలం పెంచుకోవడం. ఏపీలో కూటమి, తెలంగాణలో బీజేపీ కలిసి ముఫ్ఫైకి పైగా స్థానాలను గెల్చుకోబోతున్నారు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారుతుందన్నమాట.