స్పూన్ తో తినడం, ఎడమచేతిలో భోజనం చేయడాన్ని సమర్థించరు హిందువులు. నేలపై కూర్చుని కిందకు వంగి కుడిచేత్తో పద్దతిగా భోజనం చేయాలని చెబుతారు. అయితే దీనివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు..ఆరోగ్యానికి మేలుచేసే కారణాలూ ఉన్నాయి…
ఐదువేళ్లలో ఎంతో శక్తి
ఎడమచేత్తో భోజనం చేయకూడదని చెబుతారు కానీ కుడిచేత్తో తినడం వల్ల ఎందుకు మేలు జరుగుతుందో మాత్రం వివరించి చెప్పేవారి సంఖ్య తక్కువే. వాస్తవానికి స్పూన్ తో స్టైలిష్ గా భోజనం చేస్తుంటారు కానీ చేతులతో తినడమే మంచిది. చేతికున్న ఐదువేళ్లు పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు. అందుతే చేతులతో ఆహారాన్ని తినడం వల్ల ఐదు వేళ్ల శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. చేతులతో తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందంటారు. కుడిచేతితో తినడం ఎంత ప్రయోజనకరమో జ్యోతిష్యశాస్త్రం చెబుతుందంటారు పండితులు. మీరు మీ చేతులతో ఆహారాన్ని తాకినప్పుడు, స్పర్శ, వాసన, దృష్టి, వినికిడి, మీ రుచి.. ఇలా అన్ని ఇంద్రియాలు సక్రియం అవుతాయి. ఇంద్రియాలు న్యూరల్ రిఫ్లెక్స్ ద్వారా సక్రియం అవుతాయి. ఇది అసంకల్పిత చర్యేకానీ ఈ చర్య మెదడును ఉత్తేజితం చేస్తుంది.
కుడిచేత్తో ఎందుకు తినాలి
కుడి చేయి సూర్యు నాడిని సూచిస్తుంది. ఎక్కువ శక్తి అవసరమయ్యే పనులను చేయడానికి కుడి చేయిని ఉపయోగిస్తారు. ఏడమచేయి చంద్రనాడిని సూచిస్తుంది. దీనికి తక్కువ శక్తి అవసరం. అలాంటి కొన్ని పనులను ఎడమ చేతితో చేయాలని చెబుతారు. దీనికి తక్కువ శక్తి అవసరం.
అన్ని శుభాలు, పవిత్ర కార్యాలు కుడి చేతితో మాత్రమే జరుగుతాయి. కుడిచేతితో మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇది శరీరంలో పాజిటివ్ ఎనర్జీని మెయింటెయిన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఐదువేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. చేత్తో తింటే ఏదో తప్పుచేసినట్టు చూస్తున్నారు. మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. చేతితో కలం పట్టుకుంటే రాయాలని అనిపిస్తుంది..కర్ర పట్టుకుంటే ఎవరినైనా కొట్టాలని అనిపిస్తుంది. చాకు పట్టుకుంటే ఏదో ఒకటి చివరికి కూరగాయలకు గాట్లైన పెట్టితీరుతారు. ఇలా చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజగుణాన్ని చేతులు గ్రహించి ఆ దిశగా ప్రేరేపిస్తాయి.
స్పూన్ తో తినడం అలవాటు చేసుకున్నారు కానీ చాలా మంది స్టేటస్ కోసం ఇలా చేస్తారు. కానీ చేతితో తింటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. స్పూన్‌తో తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం కూడా అదే చెబుతుంది.