ఈ గ్రామదేవత చాలా పవర్ ఫుల్..అత్యంత విశిష్టం ఆమె రూపం!

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం
భీమవరం మావుళ్ళమ్మ ..విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంత మహిమాన్వితమైన తల్లి. భీమవరం నగరానికి తలమానికంగా వెలుగుతోన్న ఈ ఆలయం తొమ్మిది దశాబ్దాల క్రితం భీమవరం అనే చిన్న గ్రామలో వెలసి అశేష భక్తులతో పూజలందుకుంటోంది.

గ్రామదేవతే కానీ..
భీమవరం ప్రాంతాన్ని ఒకప్పుడు తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యడు పాలించాడు. ఆయన పేరుమీదే భీమవరం అనే పేరు వచ్చిందని చెబుతారు. క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య భీమ చాళుక్యుడు నిర్మించిన శ్రీ సోమేశ్వర దేవాలయం పంచారామాల లో ఒకటిగా ప్రతీతి. గునుపూడి శ్రీ సోమేశ్వర దేవాలయానికి పశ్చిమ దిశగా సుమారు కిలోమీటరు దూరంలో మావూళ్లమ్మ గుడి ఉంది. అమ్మవారు గ్రామ దేవతే అత్యంత శక్తివంతమైన అమ్మగా తెలుగురాష్ట్రాల భక్తులతో పూజలందుకుంటోంది. మావుళ్ళమ్మ దేవస్థానం సంవత్సర ఆదాయం సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా ఉంటుందంటారు. నిత్యం అన్నదానం, ఏటా ఉత్సవాలు జరుపుతారు.

అత్యంత ఆకర్షణీయంగా అమ్మవారి విగ్రహం
ఈ ఆలయం చాల ప్రాచీనమైనది. 1910 లో వచ్చిన వరదలలో విగ్రహం పాక్షికంగా దెబ్బతినటంతో నూతనగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 12 అడుగుల ఎత్తు ఉండే అమ్మవారి విగ్రహం నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం ఉంటాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. 1880 వైశాఖ మాసంలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరింది. మర్నాడు ఆ ప్రాంతంలో వెతకగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అప్పటికప్పుడు ఓ పాక వేసి అమ్మవారిని పెట్టారు. మామిడితోటలో వెలసిన అమ్మని ‘మామిళ్ళమ్మ’గా తదనంతరం ‘మావుళ్ళమ్మ’గా పిలవటం ప్రారంభించారు.

ప్రత్యేక పూజలు – ఉత్సవాలు
మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందుకే రజక సంఘం ఆద్వర్యంలో ఓసారి … వర్తక సంఘము వారి ఆధ్వర్యంలో మరోసారి ఉత్సవాలు జరుగుతాయి. నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. ప్రతి సంవత్సరం ఆరంభంలో 40 రోజుల పాటూ ఉథ్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ట మాసంలో నెల రోజులు పాటు గ్రామ జాతర గరగ ఉత్సవాలు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలుంటాయి. ఉత్సవాలు సందర్భంగా బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరికథలు సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి భీమవరానికి ప్రత్యేక బస్సులున్నాయి.