విజయనగరం ఎంపీ స్థానంలో గెలుపెవరిదన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. వైసీపీకి విజయావకాశాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కానీ టీడీపీ కూడా గట్టిపోటీ ఇచ్చింది. పోలింగ్ సరళిని విశ్లేషిస్తే ఎవరికీ గెలుపు అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది.
పనితీరుతో ప్రజల్ని ఆకట్టుకున్న బెల్లాన
విజయనగరం పార్లీమెంటు వైసిపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ 2019లో సుమారు 44 వేల మెజార్టీతో టిడిపి అభ్యర్ధి పూసపాటి అశోకగజపతిరాజుపై గెలుపొందారు. అయితే పార్లమెంటుకు గెలిచిన అభ్యర్ధులెవరూ నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకోలేదని తాను గెలిచినప్పటి నుంచి ప్రజలలోనే నిరంతరం ఉంటూ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృధ్దికి కృషి చేసానని ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్ తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.
పొరుగు జిల్లా నుంచి వచ్చిన కలిశెట్టి
చంద్రబాబునాయుడి ఆశీస్సులతో తాను ఎంపిగా పోటీ చేస్తున్నానని, టిడిపి అధికారంలోనికి వస్తే చేపట్టబోయో సంక్షేమ పథకాలు, అభివృద్దిని చెబుతూ టిడిపి అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు ప్రజలలో విస్తారంగా ప్రచారం నిర్వహించాడు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని తద్వారా విజయనగరం పార్లమెంటు అభివృధ్ది చేసేందుకు అవకాశం ఉంటుందని కలిశెట్టి ముమ్మర ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందు సర్వశక్తులూ ఒడ్డారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల నియోజక వర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజక వర్గాలు కలుపుకొని ఏడు నియోజక వర్గాలున్నాయి.
ఎక్కువగా ఓట్లేసిన మహిళా ఓటర్లు
ఏడు నియోజక వర్గాలలో మొత్తం ఓటర్లు 15,67,039 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,85,642 మంది, మహిళా ఓటర్లు 7,81,373 మంది ఉన్నారు. 12,84,876 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 6,36,609 మంది కాగా 6,48,267 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే పార్లమెంటు పరిధిలో కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలకు ఆకర్షితులై ఓటు తమకే వేశారని వైసిపి వర్గాలు చెబుతుండగా, చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు నచ్చి తమకే ఓటు వేశారని కూటమి నాయకులు అంచనా వేసుకుంటున్నారు.