2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 44.75 శాతం పోలింగ్ నమోదు అయింది. తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లో 48.48 శాతానికి పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే 3.73 శాతం ఓటింగ్ పెరిగింది.
ఓట్లేయని పాతబస్తీ ఓటర్లు
పాత బస్తీ ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపించింది. చార్మినార్, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా ప్రాంతాల్లో యాభైశాతానికి పైగా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. మలక్ పేటలో మజ్లిస్ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి తలుపులు బాది ఓటింగుకు తరలిరావాలని కోరినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు.పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధానంగా కారణం పాతబస్తీలో ప్రజలకు అవగాహన పెంచలేకపోవడం. పాతబస్తీలో ఏ పార్టీ కూడా ప్రచారం కూడా చేయలేదు.
పాతబస్తీలో వేరే పార్టీలను అడుగు పెట్టనీయని మజ్లిస్
అసలు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా చాలామంది ఓటర్లకు తెలియదు. మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కనీసం ఎన్నికల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేయరు. ప్రచారం, ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గల్లీ లీడర్ల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్లను చైతన్యవంతులను చేస్తే వారు నిలదీస్తారనే భయంతో పాటు మజ్లిస్ వ్యతిరేక ఓటు పడుతుందని వారు అసలు ఎన్నికల గురించి ఎవరికీ చెప్పరని అంటారు. పాతబస్తీలో నిరక్షరాస్యత, నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
పోలింగ్ జాబితాల్లో తప్పులు కూడా !
హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి హైదరాబాద్ నగర ఓటర్ల జాబితాల్లో డబుల్ ఓటింగ్, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడం మరో కారణం. ఓటర్ల జాబితాలో పేరున్న వృద్ధులు మరణించినా వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడంతో ఓటింగు తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా పాతబస్తీలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే సులువుగా పోలింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసేవారు లేరు.