విశాఖ నగర పరిధిలోని నార్త్ నియోజకవర్గంలో పోలింగ్ సమయానికి బీజేపీకి అనుకూలంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు గట్టిపోటీ ఇచ్చారు. కూటమిగా అభ్యర్థిగా 2014 మాదిరిగానే విష్ణుకుమార్ రాజు బరిలో నిలిచారు. ఆయనకు ఉన్న మంచి పేరు.. బీజేపీ, మోదీకి ఉన్న క్రేజ్ కారణంగా సులువుగా గెలుస్తారని అంచనా వేస్తున్నారు.
గంటా కారణంగా టీడీపీకి మైనస్
విశాఖ నార్త్‌లో ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. కానీ ఆయన ఐదేళ్లు ప్రజలకుదూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటున్నారన్న పేరును వైసీపీ అభ్యర్థి కేకే రాజు సంపాదించుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అధికార పార్టీ అభ్యర్థి కావడంతో ఓడిపోయినప్పటికీ.. ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించి అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈ కారణంగా అక్కడ టీడీపీ రేసు నుంచి ముందే వెెనుకబడింది.
బీజేపీకి ఇవ్వడంతో రేసులో
మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు మంచి పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై బీజేపీలో మరెవరూ చేయని రీతిలో విమర్శలు గుప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం, వివాద రహితుడు కావడం, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు విష్ణుకుమార్‌రాజుకు ఉంది. అందుకే గంటా చేసి పోయిన మైనస్ ను వేగంగా ప్లస్ గా మార్చుకున్నారు.
పోల్ మేనేజ్ మెంట్,. ప్రభుత్వ వ్యతరేకతతో విష్ణు ముందంజ
రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే.. కేకే రాజు, విష్ణు కుమార్ రాజు పోటీ జరిగింది. జేడీ లక్ష్మినారాయణ పోటీలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం నామమాత్రంగానే ఉంది. పోల్ మేనేజ్ మెంట్ తో విష్ణుకుమార్ రాజు… పోలింగ్ రోజున తనదైన ముద్ర చూపించారని.. టీడీపీ, జనసైనికులు సంపూర్ణంగా సహకరించడంతో ఘన విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.