నర్సాపురం లోక్ సభ స్థానంలో బీజేపీ విజయం వార్ వన్ సైడ్ గా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో పాటు … ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఏకపక్ష ఓటింగ్ జరిగింది. వైసీపీ అభ్యర్థి బలహీనంగా ఉండటం.. రాజకీయంగా అంత చురుకుదనం లేకపోవడంతో ఆమె గట్టి పోటీ ఇవ్వలేకపోయారని అంచనా వేస్తున్నారు.
భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీ ఖాయం
నర్సాపురం బీజేపీకి కంచుకోటలాంటిదే. ఎప్పుడు పొత్తుల్లో భాగంగా పోటీ చేసినా ఘన విజయాలు సాధిస్తూ ఉంటారు. 2014లో గోకరాజు గంగరాజు ఎంపీగా గెలిచారు. తర్వాత మళ్లీ 2024లో భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీ చేశారు. అనూహ్య పరిస్థితుల్లో సీటు దక్కించుకున్న ఆయన .. కూటమి లో ఉన్న అన్ని పార్టీలను సమన్వయంతో కలుపుకుని ముందుకెళ్లారు. మూడు పార్టీలుకలిస్తే తిరుగులేని మెజార్టీ వస్తుందని గత లెక్కలు తేల్చి చెబుతున్నాయి.
లక్షకుపైగా మెజార్టీ వచ్చే చాన్స్
గత ఎన్నికల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనకు కలిపి ఆరు లక్షల అరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసిన రఘురామకృష్ణరాజుకు వచ్చింది నాలుగున్నర లక్షల ఓట్లు మాత్రమే . అంటే రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు కౌంట్ చేస్తే.. రెండున్నర లక్షల మెజార్టీ వస్తుంది. ఈ సారి అభ్యర్థిగా ఉమాబాల అనే పెద్దగా ఎవరికీ తెలియని నేతను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం… మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటంతో మొదటే అడ్వాంటేజ్ వచ్చింది.
ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం
పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు,, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుస్తారని పోలింగ్ సరళి స్పష్టం చేసింది. నర్సాపురం, పాలకొల్లు, తణుకుల్లో భారీ మెజార్టీ వస్తుంది. ఆచంట, ఉండి, తాడేపల్లి, భీమవరంలలో కూడా మంచచి మెజారటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీగా నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ పార్లమెంట్ లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.