బెంగాల్,, బీహార్ లకన్నా అరాచక ప్రదేశ్ గా ఏపీ మారిపోయింది. బీహార్, బెంగాల్ లో ఎన్నికలు అంటే దాడులు, దహనాలు కామన్. ఇప్పడు ఆ జాబితాలో ఏపీ కూడా జరిగింది. ఊహించనంతగా హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మితిమీరిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో మితిమీరిన హింస
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడూ ప్రశాంతంగా జరిగేవి. రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో, పల్నాడులో మాత్రం కాస్త గట్టి ఏర్పాట్లు చేసేవారు. రాను రాను అక్కడ పరిస్థితి మెరుగుపడింది. ఈ సారి మాత్రం దాడులు, దహనాలు భయంకరంగా మారాయి. పోలింగ్ రోజు పల్నాడు, తాడిపత్రి వంటి చోట్ల జరిగిన దాడుల దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తర్వాత రోజు కూడా గొడవలు ఆగలేదు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై పట్టపగలు హత్యాయత్నం చేశారు. పల్నాడులో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అన్న పరిస్థితికి వచ్చింది.
రాజకీయ నేతలు ఎందుకు యువతను బలి చేస్తారు ?
ఏపీలో ఇంత తీవ్రంగా హింస పెరగడానికి కారణం పాలకుల క్రిమినల్ మైండ్ సెట్. ఓ అభ్యర్థిపై హత్యయత్నం చేసిన వారిని పొరపాటున అదే అభ్యర్థి ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే తనపై దాడి చేసిన వారిని సింపుల్ గా వదిలేస్తారా.. అలా వదిలేస్తే చేతకాని వాళ్లని అంటారని.. ఇష్టం లేకపోయినా పగ తీర్చుకోవాల్సిందే. ఈ తరహాలోనే ఫ్యాక్షనిజం స్థాయికి గొడవులు వెళ్లిపోతాయి. ఇలాంటి వాటిని అదుపు చేయాల్సింది రాజకీయ నేతలే. కానీ వారే ప్రోత్సహిస్తున్నారు. తమ క్యాడర్ ను బలి చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ?
ఇప్పుడు జరుగుతున్న హింస పోలింగ్ హింసనే. ఫలితాలు వచ్చిన తర్వాత జరిగే హింస ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో హింస ఎప్పుడూ సమ్మతం కాదు. కానీ అధికార దాహానికి అలవాటుపడిన నాయకులు తమ క్యాడర్ ప్రాణాలతో చెలగాటమాడటానికి కూడా రెడీ కావడంతోనే సమస్యలు వస్తు్న్నాయి.