భారత్ లో విలీనాన్ని కోరుతున్న ఆక్రమిత కశ్మీర్ ప్రజలు…

కశ్మీర్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమేనని, పాకిస్థాన్ అక్రమంగా కశ్మీర్లోని ఒక ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తోందని భారత ప్రభుత్వం నిత్యం ప్రకటిస్తూనే ఉంది.ఏదోక రోజున ఆక్రమిత కశ్మీర్ మనకు వచ్చి చేరుతుందని, కశ్మీర్ మొత్తం మనదే అవుతుందని భారత్ వాదిస్తోంది. పైగా ఆక్రమిత కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలు ఉండటం కూడా భారత్ కు ఆక్షేపణీయమైన అంశం. అందుకే సర్జికల్ దాడులు జరిపి ఉగ్రవాదులను హతమార్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకోవడం మరో ఎత్తు అని చెప్పాలి…

ఊపందుకున్న ప్రజా ఉద్యమం

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పుడు ప్రజాఉద్యమం ఊపందుకుంది. పాకిస్థాన్ పోలీసులపైనా, పాక్ పాలకులపైనా అక్కడి జనం తిరగబడుతున్నారు. దీనితో ఆక్రమిత కశ్మీర్ పై పాకిస్థాన్ పట్టు సడలిపోతోంది. దశాబ్దాలుగా తన ప్రాంతాన్ని అక్రమంగా వారి చేతిలో పెట్టుకున్నారని ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడి ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. భారత దేశంలో విలీనాన్ని కోరుతూ రావల్కోట్ లో పోస్టర్లు కూడా వేశారు.

పోలీసులను తరిమి కొడుతున్న జనం…

అడ్డుకునేందుకు వస్తున్న పోలీసులను కూడా ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఉపేక్షించడం లేదు. వారిపైనా తిరగబడుతున్నారు. పోలీసులతో ఘర్షణలకు దిగుతున్నారు. తొలుత శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించగా నిరసనలు పెల్లుబికాయి. పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేయడంతో ఊపిరాడక ఓ చిన్నారి చనిపోయింది. దానితో జనం రెచ్చిపోయి ఒక మిలటరీ ఇంటెలిజెన్స్ వాహనాన్ని తగులబెట్టారు. పోలీసు శాఖలోని అసిస్టెంట్ కమిషనర్ పై కూడా జనం దాడి చేశారు.

మారుమోగుతున్న భారత్ అనుకూల నినాదాలు

ఆక్రమిత కశ్మీర్లో ఎక్కడ చూసినా భారత అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి. తొలుత జమ్మూకశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. షాపుల షట్టర్లను దించేసి వాహనాల రాకపోకలను ఆపేశారు. ఆక్రమిత కశ్మీర్లో ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపిస్తోంది. అక్కడి కరెంట్ బిల్లులు ఇండియా కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే భారత్ లో కలిసిపోయే.. దిగులు చింతా లేకుండా హాయిగా బతకొచ్చని వాళ్లు భావిస్తున్నాయి. దానితో అక్కడక్కడా భారత అనుకూల నినాదాలు చేస్తున్నారు… పాకిస్థాన్ వద్దు..ఇండియా ముద్దు అంటున్నారు….