లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. 400 స్థానాల్లో విజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఆ పార్టీ జీవచ్ఛవంగా పడున్నదని మోదీ వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడమే బీజేపీ కర్తవ్యమని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు. ఇందుకోసం అహరహం పనిచేస్తున్నామని చెబుతున్నారు….
రామ్ లల్లాను మళ్లీ టెంట్ లోకి చేర్చుతారు…
అయోధ్య రామాలయ నిర్మాణంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఆలయానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి గుడి కట్టేందుకు చర్యలు చేపట్టింది. రికార్డు టైమ్ లో ఆలయాన్ని పూర్తి చేసి స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. నిత్యం రాముడికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇస్తోంది. లోక్ సభకు నాలుగో దశ ఎన్నికల వేళ…. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆలయంలో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని మళ్లీ టెంటులోకి తీసుకు వస్తారని ఆయన అంటున్నారు.పైగా అవి తన మాటలు కాదని, కాంగ్రెస్ పార్టీ స్వయంగా మాట్లాడిన మాటలని ఆయన గుర్తుచేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ముస్లిం ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని మోదీ ఆరోపించారు….
దక్షిణాదిలో బలపడుతున్న బీజేపీ..
ఈ సారి బీజేపీకి కొత్త ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీకి బలం పెరుగుతోందని విశ్లేషణలు, సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వ డీఎంకే ప్రభుత్వ అవినీతితో జనం విసిగిపోయారు. నిజాయతీగా పనిచేసే బీజేపీ వైపుకు తమిళ ఓటర్లు ఆశగా చూస్తున్నారు. అందుకే ఇటీవల 39 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత లెక్కలేసుకుంటే కనీసం 10 నుంచి 12 స్థానాల వరకు తమిళనాట బీజేపీకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు విశ్వవిస్తున్నారు. మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమకు క్లీన్ స్వీప్ ఖాయమని ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో 17 లోక్ సభా నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ కనీసం పది చోట్ల గెలుస్తామని ఎదురుచూస్తోంది. అలాగే టీడీపీతో పొత్తులో భాగంగా ఆరు చోట్ల పోటీ చేసిన బీజేపీ అన్నింటా విజయం ఖాయమని నమ్ముతోంది…
వారణాసిలో రేపు నామినేషన్…
ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో రేపు (మంగళవారం) నామినేషన్ వేస్తారు. ఇందుకోసం ఇవాళ భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఐదు కిలోమీటర్ల దూరం సాగే రోడ్ షోలో లక్షలాదిగా కాశీ జనం పాల్గొంటారు. షెహనాయి వాద్యాలు, నృత్య రూపకాలతో ఈ రోడ్ షో జరుగుతుంది. మరో పక్క నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుతారని చెబుతున్నారు.