అంబానీ, అదానీ అంశం – రాహుల్ కు బీజేపీ కౌంటర్ స్ట్రైక్

అద్దాల మేడలో కూర్చుని రాళ్లు వేయడం కాంగ్రెస్ నేతలకు బాగా అలవాటు. అందుకే వారి గాలి మేడలు కూలిపోయి, దెబ్బలు తగిలి తల బొప్పి కడుతూ ఉంటుంది. ఐనా సరే మారితే ఒట్టు, దేనితోనైనా కొట్టు అన్నట్లుగా ఉంటుందీ వారి తీరు. ఎన్నికల వేళ రోజుకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు రాజకీయాలనే అపచారం చేస్తున్న పద్ధతి ఎవరికీ నచ్చడం లేదు. ప్రధాని మోదీ వారికి గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా.. కాంగ్రెస్ దుష్ట ఆలోచనా విధానాలను ప్రతీ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు….

ఎందుకీ మౌనం..ఏమిటీ ధ్యానం…

కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ సడన్ గా సైలెంట్ అయిపోయింది.అలా ఎందుకు జరుగుతుందో జనానికే కాదు, ఆ పార్టీ వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. అలాంటి ఒక విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలు అంటూ అదానీ, అంబానీపై విరుచుకుపడిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఇప్పుడా అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదని మోదీ నిలదీశారు. ” రాహుల్ తరచూ అదానీ- అంబానీ ప్రస్తావన తెచ్చేవారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయన ఆ విషయంలో సైలెంట్ అయిపోయారు. నేను ఒక విషయం అడగాలనుకున్నాను. అంబానీ – అదానీ నుంచి రాహుల్ ఎంత తీసుకున్నారు. వారి మధ్య డీల్ ఏమిటి. అంబానీ – అదానీలను తిట్టిపోయడం ఎందుకు ఆపారు. నిజంగానే ఏదో జరిగి ఉంటుంది. అందుకే ఐదేళ్లు గగ్గోలు పెట్టిన రాహుల్ రాత్రికి రాత్రి మౌనముద్రలోకి వెళ్లిపోయారు…” అని మోదీ వ్యాఖ్యానించారు.

కావాలనే మాట్లాడిస్తున్నారు…

దేశంలో సంపదను సృష్టించేవాళ్లంటే కాంగ్రెస్ పార్టీకి అసలు పడదని చాలా ఉదంతాలు నిరూపించాయి. బడా పారిశ్రామికవేత్తలపై ఆరోపణలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. గౌతమ్ అదానీపై రోజు వారీ ఆరోపణలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు తనను ఆదేశించినట్లు ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రకటించారు. అదానీ గ్రూపుకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆరోపణలు ఆపేద్దామని తాను ప్రతిపాదిస్తే అందుకు అధిష్టానం అంగీకరించలేదని గౌరవ్ వల్లభ్ గుర్తుచేసుకున్నారు.

ప్రియాంకకు స్మృతీ ఇరానీ సవాల్

ప్రియాంకాగాంధీ తరచూ మోదీపై ఆరోపణలు సంధిస్తున్నారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ గట్టి సమాధానం చెప్పారు. ఆమె చేసే ఆరోపణలపై చర్చకు బీజేపీ సిద్ధమని ప్రకటించారు. ప్రియాంకకు నచ్చిన ఛానెల్, ఆమెకు నచ్చిన యాంకర్ సమక్షంలో చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని, బీజేపీ తరపున ఎవరిని రమ్మంటే వాళ్లు వస్తారని ఇరానీ తెలిపారు. అసలు ప్రియాంక రేంజ్ కు సుధాన్షు త్రివేదీని పంపితే చాలని కూడా ప్రకటించారు….