తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపంలో ఉంది తలుపులమ్మ ఆలయం. తీగ కొండ, ధార కొండ…అనే రెండు గిరుల మధ్య రాతినే ఆలయంగా చేసుకుని అమ్మవారు కొలువైంది. ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఆ పెరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…
లిలితా అమ్మవారి మరో రూపం
లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భక్తులు భావిస్తారు. కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం. పర్వతరూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ వెళతాడు. అలా సూర్య భగవానుడి రథానికి అడ్డుతగిలేంత పెరిగిపోతాడు. అదే జరిగితే లోకమంతా చీకటైపోతుంది. మహర్షులు, దేవతలు అంతా ఆ పరిస్థితి చూసి భయపడిపోతారు. అయితే అగస్త్య మహాముని అంటే మేరువుకి గౌరవం. దీంతో రుషులంతా అగస్యుడిని ఆశ్రయిస్తారు. అప్పుడు మేరువు దగ్గరకు వెళతాడు అగస్త్యుడు. వెంటనే శిరసు వంచి నమస్కరిస్తాడు మేరువు. అప్పుడు ‘ఓ మేరునగధీరుడా! నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా. తిరిగి వచ్చేంతవరకూ అలానే శిరసు వంచుకుని ఉండగలవా…’ అని అడిగాడు అగస్త్యుడు. గురువుగారు అడిగిన మాటకు సరే అన్నాడు మేరువు. అలా మేరువుని దాటుకుని వెళ్లిన అగస్త్య మహాముని.. కీకారణ్యంలోకి ప్రవేశిస్తాడు.
తలుపులమ్మ స్థలపురాణం
ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెదుకి..పాతాళ గంగను ప్రార్థిస్తాడు. అప్పుడు గంగ పర్వత శిఖరంపైనుంచి పెల్లుబుకి ఓ లోయగుండా ప్రవహించింది. అక్కడే సంధ్యావందన కార్యక్రమాలు ముగించుకుని చీకటి కమ్మేయడంతో అక్కడే విశ్రమిస్తాడు. అప్పుడే లిలితా అమ్మవారు ప్రత్యక్షమై…శిష్టరక్షణే ధ్యేయంగా తాను ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాని చెబుతుంది. అప్పుడు ఇక్కడే పూర్తిగా కొలువుతీరాలని ప్రార్థించాడు అగస్త్యుడు. అలా లోయ అన్న మాట కాలక్రమేణా లోవగా మారింది. తలంపులు తీర్చే తల్లి తలుపులమ్మగా మారింది.
ప్రయాణాలకు అధిదేవత
తలుపులమ్మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు. ఆలయానికి కిలోమీటరు దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు రాళ్ల మీదా పరిసర నిర్మాణాల గోడల మీదా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో బండి పూజ చేయించుకుంటారు. లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం. ఆంధ్రలో చాలా లారీల మీద తలుపులమ్మ పేరు కనిపిస్తుంటుంది. ప్రమాదాల నుంచి వాహనాల్నీ వాహన చోదకుల్నీ అమ్మవారు రక్షిస్తుందని భక్తుల విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే, తీగ కొండ-ధార కొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహం తీరుస్తుంది. దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు 50 అడుగుల అమ్మవారి విగ్రహం , 40 అడుగుల ఈశ్వరుని విగ్రహం చూపుతిప్పుకోనివ్వదు.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..