బీజేపీలో చేరిన శేఖర్ సుమన్

ఆయన మంచి నటుడు. రేఖ లాంటి అగ్రనాయికలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న యాక్టర్. భారత్లో తొలి తరం టీవీ నటుల్లో ఆయన ఒకరు. పైగా కామెడీ షోల్లో జడ్జిగా కూడా ఆయన పాపులర్ అయ్యారు. దేనికైనా స్పాంటేనియస్ గా సమాధానమిచ్చే శేఖర్ సుమన్..ఇప్పుడు రాజకీయాల్లోకి దూకుతున్నారు. ఆయనకు ఇష్టమైన, ప్రజలకు అవసరమైన పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు.

నిన్నటి దాకా అనుకోలేదు…

లోక్ సభ ఎన్నికలు మూడు దశలు ముగిసి నాలుగో దేశ వైపుకు వెళ్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీకి పెద్ద బూస్టింగ్ వచ్చింది. శేఖర్ సుమన్ హఠాత్తుగా ఢిల్లీలోని బీజేపీ కేంద్రకార్యాలయంలో ప్రత్యక్షమై కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అప్పుడు బీజేపీ మీడియా డిపార్టమెంట్ జాతీయ ఇంచార్జ్ అనిల్ బలూనీ కూడా అక్కడనే ఉన్నారు. నిన్నటి వరకు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో 24 గంటల్లో బీజేపీలో చేరానని శేఖర్ సుమన్ చెప్పుకున్నారు…

దేవుడు శాసించాడు, సుమన్ పాటించాడు…

బీజేపీలో చేరడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని శేఖర్ సుమన్ చెప్పుకున్నారు. జీవితంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయని, కొన్ని మనకు తెలియకుండానే జరుగుతాయని ఆయన నిర్వచించారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కీలక పనులు చేసేస్తుంటామని, అది దేవుడిచ్చిన ఆజ్ఞ అని తర్వాత తెలుస్తుందని శేఖర్ సుమన్ చెప్పుకొచ్చారు.దేవుడు శాసించడం వల్లే తాను బీజేపీలో చేరానని సుమన్ వివరించారు. అందుకు ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.

మోదీ, అమిత్ షా నాయకత్వానికి ప్రశంసలు..

దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందంటే అది ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వం వల్లే సాధ్యపడిందని శేఖర్ సుమన్ విశ్లేషించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీకి సరైన మార్గంలో దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. చెప్పడం వేరు, చేయడం వేరని ప్రధాని మోదీ చెప్పింది చేసే నాయకుడని శేఖర్ సుమన్ కితాబిచ్చారు ప్రధాని మోదీ మాటల మనిషి కాదని చేతల మనిషని ఆయన అన్నారు. తాను పదవులను ఆశించి పార్టీలోకి రాలేదని, పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని శేఖర్ సుమన్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. పార్టీ కోరితే ప్రచారానికి వెళ్తానన్నారు. మరో పక్క కాంగ్రెస్ మీడియా డిపార్టమెంట్ కో-ఆర్డినేటర్ రాధికా ఖేరా కూడా బీజేపీలో చేరారు.