బాపట్లలో హోరాహోరీ – కూటమికి కలిసి వస్తోందా ?

బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎస్‌సి రిజర్వుడు స్థానమైన బాపట్ల పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, సంతనూతలపాడు అసెంబ్లీ స్థానం ప్రకాశం జిల్లాలో ఉంది. బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ స్థానాల నుంచి 89 మంది, బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు మొత్తంగా 104 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,91,716 మంది ఓటర్లున్నారు. బాపట్ల పార్లమెంటు నుంచి వైసిపి తరఫున ప్రస్తుత ఎంపి నందిగం సురేష్‌ మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. టిడిపి నుంచి మాజీ ఐపిఎస్‌ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌ పోటీ చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నేతగా ఉండి టీడీపీ తరపున అభ్యర్థిగా మారిన కృష్ణ ప్రసాద్

టిడిపి అభ్యర్థి కృష్ణప్రసాద్‌ పూర్తిగా నియోజకవర్గానికి కొత్త. తెలంగాణలో బిజెపి నేతగా ఉన్న కృష్ణప్రసాద్‌ బాపట్ల నుంచి టిడిపి తరఫున ఎంపిగా పోటీలో ఉన్నారు. నందిగం సురేష్‌ కూడా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. చీరాల అసెంబ్లీ నుంచి మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది.

చీరాలలో త్రిముఖ పోటీ

గతంలో చీరాల అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత వైసిపికి మద్దతు పలికిన కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్‌ వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున మద్దులూరి మాలకొండయ్య పోటీలో ఉన్నారు. వేమూరు నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు టిడిపి నుంచి పోటీ చేస్తుండగా, వైసిపి నుంచి వరికూటి అశోక్‌బాబు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచి మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జునను సర్వేల ఆధారంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడుకు మార్చారు. ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న అశోక్‌బాబును వేమూరు నుంచి పోటీలో నిలిపారు. ఇక్కడ టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉంది.

చేరికలతో బాపట్ల టీడీపీలో ఆశలు

బాపట్ల నుంచి శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి వేగేశన నరేంద్రవర్మ మొదటిసారి పోటీ చేస్తున్నారు. బాపట్లలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నవారు కూడా ఇక్కడ టిడిపిలో చేరారు. ఈ కారణంగా బాపట్లలో పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. జిల్లాలోని పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు అసెంబ్లీల నుంచి మొన్నటి వరకు వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న వారిని తప్పించి కొత్త వారిని ఎన్నికల బరిలో నిలిపారు. ఇలా ఇన్‌ఛార్జులను మార్చడంతో వైసిపి ఎన్నికల వ్యూహం బెడిసికొట్టింది. పర్చూరు, అద్దంకి, రేపల్లె నుంచి టిడిపి ఎమ్మెల్యేలుగా ఉన్న ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. బాపట్ల పార్లమెంటు అభ్యర్థి గెలుపును ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు శాసించనున్నాయి.