ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండ. ఇక్కడున్న ఉగ్ర నరసింహస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే నారసింహ క్షేత్రం అయినప్పటికీ ఆంజనేయ క్షేత్రంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధులకు తగ్గుముఖం పడతాయని భక్తుల విశ్వాసం.
స్థల పురాణం
14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజూ ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. రోజంతా మేతకు తీసుకెళ్లి తీసుకొచ్చినా ఇంటికొచ్చి పాలివ్వకపోవడంతో యజమానికి సందేహం వచ్చింది. ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ రోజు ఆ ఆవును కనిపెట్టుకుంటూ వెళ్లాడు. ఆ ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ రాతిలోంచి ఓ బాలుడు ఉద్భవించి ఆవుపాలు తాగి వెళ్లడం చూసి స్థాణువులా నిలబడిపోయాడు. రాతిలోంచి బాలుడు రావడం చూసి అదంతా దైవలీలగా భావించి ఆ రాతిని పూజించాడు. అలా కాలక్రమేణా అక్కడ నృసింహస్వామి ఆలయం నిర్మించారు.
సేద తీరిన ఆంజనేయుడు
కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి కూడా స్థల పురాణం ఉంది. తల్లి దగ్గరకు వెళ్లేందుకు దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించిన ఆంజనేయుడు ఈ ప్రాంతంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడట. అదే సమయంలో అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరకొండలో నారసింహ స్వామి ఆలయంలో ధ్వజారోహణం చేస్తుండగా కిందన ఓ దివ్యపురుషుడు కనిపించాడు. పరుగుల కిందకు వెళ్లి చూసేసరికి అక్కడ విగ్రహం కనిపించింది. ఇక సింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహా యోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడట. తమ గ్రామాన్ని రక్షించేందుకు ఆంజనేయుడే స్వయంగా వచ్చాడని భావించిన గ్రామస్తులు హనుమాన్ కి కూడా ఆలయం కట్టించి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ బాధలుండవని, మృత్యుభయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం…
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..