వినుకొండ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి పోటీచేస్తుండగా గత ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు కూడా మరో సారి పోటీలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆంజనేయులు 2019లో ఓడిపోయారు. 2019లో టిడిపి పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల వైసిపి అభ్యర్థి బొల్లాబ్రహ్మనాయుడు 32వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తాననుకుంటున్న్ టీడీపీ అభ్యర్థి
వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు తాను చేసిన సేవాకార్యక్రమాలు తనను గెలిపిస్తాయని టిడిపి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు చెబుతున్నారు. 2004 నుంచి ఆంజనేయులు నియోజకవర్గాన్ని అంటిబెట్టుకుని ఉన్నారు. 2009, 2014లో ఆయన గెలుపొందారు. గత ఎన్నికల్లో బొల్లాకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జనరావు ఈసారి టిడిపిలో చేరి జి.వి.ఆంజనేయులు విజయంకోసం కృషి చేస్తున్నారు. గత రెండు నెలలుగా బొల్లా, జి.వి.ఆంజనేయుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది.
బొల్లా దూకుడు ప్రవర్తన వివాదాస్పదం
వ్యాపార వేత్తగా పేరొందిన బొల్లా బ్రహ్మనాయుడు 2009లో ప్రజారాజ్యం తరఫున వినుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పెదకూరపాడులో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో ఆయనవినుకొండ నుంచి వైసిపి అభ్యర్థిగాపోటీ చేసి గెలిచారు. ఆయన దూకుడు వైఖరి మొదటి నుంచి వివాదాస్పదం అయింది. వినుకొండలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించారంటూ ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో కేసులు పడ్డాయి. బ్యాంకుల్లో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రూ.50 కోట్ల రుణం పొందారని చెప్పుకుంటున్నారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ
స్థానిక ఎన్నికల్లో శావల్యాపురం జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెల్చుకుంది. ఆ స్థానంలో గత ఎన్నికలలో వైసీపీకి మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం ప్రారంభమయింది. ఈ క్రమంలోనే అంగ అర్థబలాలతో ఆయన తన ప్రయత్నంలో వేగం పెంచారని చెబుతున్నారు.